బ్యాంకుల్లో జనం దాచుకుంది కోటీ 35 లక్షల కోట్లు

గత ఎనిమిదేళ్లలో పెరిగిన డిపాజిట్లు రూ.50 లక్షల కోట్లుపైనే..
రూ.55 లక్షల కోట్లకు పైగా సేవింగ్స్ డిపాజిట్లు.. రూ.78 లక్షల కోట్లు దాటిన టర్మ్ డిపాజిట్లు
విదేశీ బ్యాంకుల్లో భారతీయుల సేవింగ్స్ 87,284 కోట్లు.. 40 ఏళ్ల క్రితం ఇవి 381 కోట్లే
ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ 2021–22 నివేదికలో రిజర్వు బ్యాంకు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తలసరి అప్పు గురించి విన్నాం.. తలసరి ఆదాయం గురించి తెలుసుకున్నాం.. దేశం, రాష్ట్రాల అప్పుల చర్చలూ చూశాం.. మరి మన దేశంలో ప్రజలు బ్యాంకుల్లో వివిధ రూపాల్లో దాచుకున్న సొమ్ము ఎంతో తెలుసా..? రూ.1,35,59,212 కోట్లు.. అక్షరాల్లో చెప్పాలంటే.. కోటీ 35 లక్షల కోట్ల పైచిలుకే. దీనిని మన దేశ జనాభాతో సగటున లెక్కిస్తే ఒక్కొక్కరి సొమ్ము సుమారు లక్ష రూపాయలు అని చెప్పొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ లెక్కలను వెల్లడించింది. ఇండియన్ ఎకానమీ స్టాటిస్టిక్స్ (2021–22) పేరిట రిజర్వు బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది. అందులో 1983వ సంవత్సరం నుంచీ 2021–22 వరకు బ్యాంకుల్లో భారతీయులు డిపాజిట్ చేసిన సొమ్ము లెక్కలను వెల్లడించింది.
సేవింగ్స్ భారీగా పెరుగుతూ..
1983–84 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు దాచుకున్న సేవింగ్స్ డిపాజిట్ల విలువ రూ.17,811 కోట్లు. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.17,430 కోట్లు ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.381 కోట్లు దాచుకున్నారు. పదేళ్ల తర్వాత అంటే 1993–94లో సేవింగ్స్ డిపాజిట్లలో సొమ్ము రూ.71,151 కోట్లకు చేరింది. విదేశీ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు రూ.1,718 కోట్లుగా ఉన్నాయి. మరో పదేళ్ల తర్వాత అంటే.. 2003–04 నాటికి బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3.85 లక్షల కోట్లు దాటాయి. విదేశీ బ్యాంకుల్లో భారతీయులు చేసిన డిపాజిట్లు రూ.12,232 కోట్లకు చేరాయి. ఇక 2013–14 నాటికి సేవింగ్స్ రూ.20 లక్షల కోట్లు దాటాయి. ఇందులో భారతీయ బ్యాంకుల్లో రూ.19.6 లక్షల కోట్లకుపైగా ఉండగా.. విదేశీ బ్యాంకుల్లో రూ.40,390 కోట్లకు చేరాయి.
2014 నుంచి సేవింగ్స్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో)
ఏడాది భారత బ్యాంకుల్లో విదేశీ బ్యాంకుల్లో మొత్తం
2014–15 21,78,847 41,046 22,19,893
2015–16 24,92,846 43,698 25,36,544
2016–17 33,40,707 52,876 33,93,583
2017–18 35,99,341 55,896 36,55,237
2018–19 39,72,547 58,630 40,31,177
2019–20 42,85,362 65,384 43,50,746
2020–21 49,74,715 81,092 50,55,807
2021–22 55,94,034 87,284 56,81,318
2014 నుంచి వివిధ టర్మ్ డిపాజిట్ల తీరు.. (రూ.కోట్లలో)
ఏడాది 90 రోజుల్లోపు 6 నెలలు–ఏడాది 5 ఏళ్లపైన
2014 3,64,909 7,34,703 7,73,620
2015 4,27,722 7,19,993 7,91,137
2016 4,35,318 5,55,536 8,47,659
2017 4,47,000 8,40,158 9,45,980
2018 4,25,420 8,05,586 10,00,865
2019 5,16,651 6,19,998 9,25,059
2020 10,84,623 4,58,797 9,93,286
2021 13,02,760 7,96,325 7,47,654
(ఆరు నెలల లోపు, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య, రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య, మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య.. ఇలా అన్నిరకాల టర్మ్ డిపాజిట్లు కలిపి 2021–22 ఆర్థిక సంవత్సరం నాటికి షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము రూ.78,77,894 కోట్లు అని రిజర్వుబ్యాంకు నివేదికలో పేర్కొంది)
అయితే తక్కువ.. లేకుంటే సుదీర్ఘంగా..
టర్మ్ (ఫిక్స్‌డ్) డిపాజిట్ల విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా అయితే 90 రోజుల్లోపు లేదా ఐదేళ్ల కన్నా ఎక్కువకాలం ఉండే టర్మ్ డిపాజిట్ల వైపే మొగ్గు చూపుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
- 1998లో 90 రోజుల్లోపు టర్మ్ డిపాజిట్ల విలువ రూ.41,365 కోట్లుకాగా.. 2008 నాటికి 1.51 లక్షల కోట్లకు, 2018నాటికి 4.25 లక్షల కోట్ల కు, 2021–22 నాటికి 13,02,760 కోట్లకు చేరాయి.
- ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లు 1998లో రూ. 46,231 కోట్లు ఉంటే, 2008 నాటికి రూ.1.65 లక్షల కోట్లకు, 2018 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. అయితే 2021 నాటికి ఇవి రూ.7.47 లక్షల కోట్లకు తగ్గాయి.
ఆర్‌బీఐ రాష్ట్రాల వారీగా లెక్కలేమీ వెల్లడించలేదు. అయితే ఆదాయ స్థాయిని బట్టి పొదుపు ఉంటుందనే ఆర్థిక సూత్రం ప్రకారం.. తెలంగాణలో సేవింగ్స్ ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ తలసరి కంటే రాష్ట్ర తలసరి ఆదాయమూ ఎక్కువేనంటున్నారు. ఈ లెక్కన మిగతా రాష్ట్రాల కంటే
తెలంగాణలో సేవింగ్స్ సొమ్ము ఎక్కువే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు