‘అదానీ’పై అదే దుమారం

Opposition parties demand Joint Parliamentary Committee or into Adani Group issue - Sakshi

విపక్షాల ‘జేపీసీ’డిమాండ్‌తో స్తంభించిన ఉభయసభలు

అదానీ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసు: రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించాలని భావించిన ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. సోమవారం కూడా ‘అదానీ’అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. అదానీ గ్రూప్‌పై అవినీతి ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో దర్యాప్తు చేయించాలన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో ఉభయసభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

ఈ నెల ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక అదానీ అంశంపై విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో ఉభయ సభల్లోనూ మరే ఇతర కార్యకలాపాలకు అవకాశం దొరకలేదు. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సాధారణంగా ప్రధాని మోదీ ఉభయ సభల్లో బదులివ్వాల్సి ఉంటుంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ‘అదానీ సర్కార్‌ షేమ్‌ షేమ్‌’ అంటూ నినాదాలు చేశారు.

జేపీసీతో విచారణకు పట్టుబడ్డారు. స్పీకర్‌ ఓం బిర్లా వారిని తమతమ స్థానాల్లో కూర్చుని, చర్చలో పాల్గొనాలని కోరారు. వినిపించుకోక పోవడంతో తన చాంబర్‌కు వచ్చి డిమాండ్లపై చర్చించాలని సూచించారు. ఫలితం లేకపోడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్షాల వాయిదా తీర్మానాన్ని తోసిపుచ్చారు. సభ తిరిగి ప్రారంభమయ్యాకా నినాదాలు కొనసాగడంతో సభ మంగళవారానికి వాయిదాపడింది. అనంతరం విపక్ష నేతలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు. అంతకుముందు ప్రతిపక్షాల నేతలు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అదానీ అంశంపై చర్చ జరిగి మోదీ బదులివ్వాల్సిందేనని ఖర్గే చెప్పారు.

ఎగువసభలోనూ నిరసనల పర్వం
రాజ్యసభ ఉదయం ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అబ్దుల్‌ సమద్‌ సిద్ధిఖీకి నివాళులర్పించింది. అనంతరం ప్రతిపక్ష పార్టీల నేతలిచ్చిన 10 నోటీసులను సభాధ్యక్షుడు జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అంగీకరించలేదు. కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి, ప్రమోద్‌ తివారీ నోటీసులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ణయించిన ప్రకారమే కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌లో అవినీతి ఆరోపణలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులంతా ఏకమై పట్టుబట్టారు. వారి డిమాండ్‌ను చైర్మన్‌ తోసిపుచ్చారు. అంతరాయాల కారణంగానే ప్రతిపక్ష సభ్యులు అందుబాటులో ఉన్న అవకాశాలన్నీ కోల్పోయాయన్నారు. ఆందోళనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ప్రతిపక్షాల నిరసనలు ఆగకపోవడంతో మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అదానీ కోసం మోదీ ఏమైనా చేస్తారు: రాహుల్‌
పార్లమెంట్‌లో అదానీ అంశం చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకు ప్రధాని మోదీ చేయగలిగిందంతా చేస్తారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. ‘అదానీపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది. బిలియనీర్‌ వ్యాపారవేత్త అదానీ వెనుక ఉన్న శక్తి ఎవరో దేశప్రజలకు తెలుసు. పార్లమెంట్‌లో అదానీ గ్రూప్‌పై చర్చ జరిగితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. దీనిపై చర్చకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి’ అని రాహుల్‌ మీడియాతో అన్నారు.

ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ కార్యాలయాల వద్ద నిరసన
కాంగ్రెస్‌ శ్రేణులు ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐబీ), భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) కార్యాలయాల వద్ద ప్రదర్శనలు చేపట్టారు. అదానీ దేశం విడిచిపోకుండా ఆయన పాస్‌పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. పాస్‌పోర్టులను సీజ్‌ చేయకపోవడం వల్లే గతంలో వ్యాపారవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీలు దేశం విడిచి పారిపోయారని చెప్పారు. మధ్య ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ల్లోనూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top