ఇక వారానికి నాలుగే పనిరోజులు!

New Labour Codes To Allow 4Day Work Per Week Says Central Government - Sakshi

రోజుకి 12 పని గంటలు  

కొత్త కార్మిక కోడ్‌లపై కేంద్రం కసరత్తు  

తప్పనిసరి కాదన్న కార్మిక శాఖ 

ఉద్యోగుల అనుమతితో అమలు చేసుకునే అవకాశం   

న్యూఢిల్లీ: ఇక మీదట వీకెండ్‌ అంటే రెండు రోజులు కాదు. మూడు రోజులు.. ఎంచక్కా వారానికి మూడు రోజులు రిలాక్స్‌ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అలాగని పనిగంటలు తగ్గిపోతాయని అనుకోవద్దు. మిగిలిన నాలుగు రోజులు ఊపిరి సలపకుండా పనిచేయాల్సి ఉంటుంది. వారంలో నాలుగు రోజులు పనిదినాలుగా మార్చుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు అనుమతినివ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త కార్మిక కోడ్‌లపై కేంద్ర కార్మిక ఉపాధి శాఖ కసరత్తు చేస్తోంది. అయితే వారానికి 48 గంటల పని విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ కంపెనీలు వారానికి మూడు రోజులు వీకెండ్‌ సెలవులుగా ఇస్తే, నాలుగు రోజులు పనితో ఉద్యోగులకు ఊపిరి కూడా సలపదు. రోజుకి 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది.

‘‘కంపెనీలు వారానికి మూడు రోజులు సెలవు ఇస్తే, మిగిలిన నాలుగు రోజులు రోజుకి 12గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అనుమతితోనే ఈ మార్పులు చెయ్యాలి. ఈ విషయంలో ఉద్యోగులు, యాజమాన్యాలపై బలవంతం ఉండదు. కేవలం వారికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పని సంస్కృతిలో మార్పులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం’’అని కార్మిక ఉపాధి శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర చెప్పారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనల మేరకు వారానికి 48 గంటలు పని చెయ్యాలి. అంతకంటే ఎక్కువగా పని చేయించుకోవడం నిబంధనలకు వ్యతిరేకం. మన దేశంలో సాధారణంగా రోజుకి ఎనిమిది గంటలు చొప్పున వారానికి ఆరు రోజులు పని దినాలుగా ఉన్నాయి. సాఫ్ట్ట్‌వేర్‌ కంపెనీలు మాత్రమే శని, ఆదివారాలు సెలవు ఇస్తున్నాయి. ఈ కొత్త కార్మికుల కోడ్‌ అమల్లోకి వస్తే ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల అనుమతితో వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని అమల్లోకి తేవచ్చు. దీంతో పాటు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉద్యోగులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా కూడా కార్మిక కోడ్స్‌లో మార్పులు తీసుకురానున్నారు.  

40% పెరిగిన ఉత్పాదకత
2019లో జపాన్‌లో మైక్రోసాఫ్ట్‌ 4రోజుల విధానాన్ని ప్రయోగాత్మకంగా తెచ్చింది. 4 రోజులు పని చేయడం వల్ల ఆ కంపెనీ ఉత్పాదకత ఏకంగా 40శాతం పెరిగింది. కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులు గడపడం వల్ల మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేశారు. ఇలా చేయడం వల్ల కంపెనీలకు కూడా డబ్బులు ఆదా అవుతాయి. విద్యుత్‌ ఇతర ఖర్చులు బాగా కలిసొచ్చి ప్రతీ ఏడాది కంపెనీ టర్నోవర్‌లో 2% మిగులుతుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అంచనా వేసింది. అయితే కేవలం నాలుగు రోజులు పని చేస్తే వినియోగదారుల అంచనాలకు తగ్గట్టుగా పని జరగదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. మరోవైపు జర్మనీలోని అతి పెద్ద ట్రేడ్‌ యూనియన్‌ ఐజీ మెటాల్‌ ఫోర్‌ డే వీక్‌ కోసం గత ఏడాది పిలుపునివ్వడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఈ విధానం అమలు చేయడానికి మరో అయిదేళ్లు పడుతుందన్న అంచనాలున్నాయి.     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top