మంచంపైనే ఉండి కోట్ల సంపాదన.. సంకల్పం ఉండాలంతే!

Man Paralyzed From Neck Down He Set Up Crores Timber Business Kerala - Sakshi

రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన కేరళలోని కాసరగడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల వ్యాపారి.. కోట్ల విలువైన కలప బిజినెస్‌ను చేస్తున్నారు. మంచానికే పరిమితమైనా సరే.. తన ఎడమ చెవికి ఎయిర్ పాడ్ తగిలించుకుని బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. కలపకు సంబంధించిన టింబర్ డిపోల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకొని, వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.  

వివరాల్లోకి వెళ్లితే.. టీఏ షానవాస్ స్వస్థలం కాసరగోడ్‌ జిల్లాలోని ఈస్ట్ ఎలేరి పరిధిలో ఉన్న కంబలోర్. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో 2010, మే 6న అనుకోకుండా ఓ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించడంతో ఆయనకు స్పైనల్ కార్డ్ దెబ్బతిందని, ఆపరేషన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని డాక్టర్లు సూచించారు.

దీంతో నాలుగు నెలలు ఆయన ఐసీయూలో మంచానికే పరిమితమయ్యారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆపరేషన్ చేసి ఆస్పత్రిలోనే 5 నెలలు ఉంచారు. ఆయన మెడ భాగంలో స్టీల్ రాడ్ వేయడంతో మెడ కొంచెం కదిలించడానికి వీలవుతోందని వైద్యులు తెలిపారు.

9 నెలల తర్వాత తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాలని ఆసుపత్రిలోనే నిర్ణయించుకున్నారు. తన భార్య సాయంతో ఓ లారీ కలప కొని వ్యాపారం ప్రారంభించారు. లాభాలు రావడంతో మరలా కలప కొని అమ్మడం ప్రారంభించారు. ఇలా వ్యాపారం మళ్లీ గాడిలో పడింది. అయితే ఇదంతా కూడా ఆయన మంచం మీది నుంచే పర్వవేక్షణ చేశారు.

ఇప్పుడు షనవాస్ ఆఫ్రికా, మలేషియా, మాల్దీవుల నుంచి కూడా కలప తెప్పిస్తున్నారు. కేరళలో భవన నిర్మాణాలకు అవసరమైన కలప విక్రయిస్తున్నారు. అయితే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం వాటిని స్వీకరించాలని అంటున్నారు షాన్‌వాస్‌. వ్యాపారం విజయవంతంగా కొనసాగించడంలో తన కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం ఎంతో ఉందని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top