25 జిల్లాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు

Maharashtra: Lockdown Relaxation In 25 Districts By Health Minister Rajesh Tope - Sakshi

ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కరోనా రోగుల సంఖ్య సరాసరి కంటే తక్కువ ఉన్న 25 జిల్లాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు మంత్రి రాజేశ్‌ టోపే వెల్లడించారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నియమాలు సడలించే విషయంపై గురువారం చర్చించినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా లెవల్‌–3 ఉన్న జిల్లాలో వ్యాపారులు తమ షాపులు ఆదివారం పూర్తిగా మూసివేయగా, శనివారం సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు టోపే వెల్లడించారు. ఇదివరకు శని, ఆదివారాలు షాపులు మూసి ఉండేవి.

కరోనా ప్రభావిత 11 జిల్లాలను లెవల్‌–3లో ఉంచనున్నారు. ఇందులో పశ్చిమ మహారాష్ట్రలోని సాతారా, సాంగ్లీ, పుణే, షోలాపూర్, కోల్హాపూర్‌ ఇలా ఐదు జిల్లాలున్నాయి. అదేవిధంగా కొంకణ్‌ రీజియన్‌లోని నాలుగు జిల్లాలు, మరాఠ్వాడలోని బీడ్, ఉత్తర మహారాష్ట్రలో అహ్మద్‌నగర్‌ జిల్లాలున్నాయి. ఈ 11 జిల్లాలు మినహా మిగతా 25 జిల్లాలో నిబంధనలు త్వరలో ఎత్తివేస్తామన్నారు. ఇక సామాన్యులకు లోకల్‌ రైళ్లలో అనుమతించే విషయంపై మాట్లాడుతూ గురువారం జరిగిన చర్చల్లో వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు.

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారిని అనుమతించాలని ఇప్పటికే సామాన్యులు డిమాండ్‌ చేస్తున్నారు దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రైల్వే అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని టోపే అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య విభాగం, కరోనా టాస్క్‌ ఫోర్స్‌ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన నివేదిక ఆమోదం కోసం ముఖ్యమంత్రికి పంపించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించగానే అమలుకు రంగం సిద్ధం చేస్తామన్నారు. ఒకట్రెండు రోజుల్లో అమోదం లభిస్తుండవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top