లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. | Lottery Kings Jackpot: One Family, Three Parties, Three Massive Wins | Sakshi
Sakshi News home page

లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..

May 5 2026 10:09 AM | Updated on May 5 2026 10:15 AM

Lottery Kings Jackpot: One Family, Three Parties, Three Massive Wins

న్యూఢిల్లీ: వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ఇప్పుడు రాజకీయ రణరంగంలో కూడా ‘లాటరీ కింగ్’ శాంటియాగో మార్టిన్ కుటుంబం సంచలనం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. ఒకే ఇంట్లో మూడు వేర్వేరు రాజకీయ జెండాలు ఎగరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అల్లుడి అదుర్స్.. టీవీకే నుంచి ఘన విజయం
మార్టిన్ అల్లుడు (కూతురు డైసీ భర్త), నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీ సీనియర్ నేత అయిన ఆధవ్ అర్జున రెడ్డి విల్లివాక్కం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల బరిలో తన సమీప ప్రత్యర్థిపై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించి, అందరి దృష్టిని ఆకర్షించారు.

అన్నాడీఎంకే అభ్యర్థిగా లీమా రోజ్ గెలుపు
మరోవైపు శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్ కూడా తమిళనాడులోని లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్‌పై పోటీ చేశారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఆమె సుమారు 2,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

పుదుచ్చేరిలో సత్తా చాటిన జోస్
పుదుచ్చేరి ఎన్నికల్లో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి 10,205 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఆయన గతేడాది స్థాపించిన ‘లక్ష్య జననాయక కట్చి’ (ఎన్డీయే మిత్రపక్షం) తరపున పోటీ చేసి ఈ గెలుపును నమోదు చేశారు. దాదాపు రూ.15,000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న మార్టిన్ గ్రూప్.. ఎన్నికల బాండ్ల  రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు సుమారు రూ.1,300 కోట్లు విరాళంగా ఇచ్చి, గతంలో ఈడీ విచారణను సైతం ఎదుర్కోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: బెంగాల్‌ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం

Advertisement
 
Advertisement
Advertisement