మారటోరియం : సుప్రీం కీలక తీర్పు

 Loan moratorium cannot be extended, says Supreme Court - Sakshi

మొత్తం వ‌డ్డీ మాఫీ అంశంలో జోక్యం చేసుకోలేం : సుప్రీం 

ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని  ఆదేశించలేం

ప్రత్యేక రంగాలకు ఉపశమనాన్ని కోరలేం

సాక్షి, ఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్‌  సమయంలో రుణాలపై విధించిన మారటోరియం పొడిగింపు, మొత్తం వడ్డీని మాఫీ చేయడం లాంటి అంశాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే ఆరు నెలల రుణ మారటోరియంను పొడిగించాలని కోరుతూ వివిధ వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థల పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం తన తీర్పును ప్రకటించిన సుప్రీం  వడ్డీని పూర్తిగా మాఫీ చేయలేమని పేర్కొంది. అలాగే మాలాఫైడ్, ఏకపక్షంగా ఉంటే తప్ప కేంద్రం ఆర్థిక నిర్ణయాలను న్యాయ సమీక్ష చేయలేమని పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక ఉపశమనం లేదా ప్యాకేజీలను ప్రకటించమని ప్రభుత్వాన్ని లేదా కేంద్ర బ్యాంకును ఆదేశించలేమని, ప్రత్యేక రంగాలకు ఉపశమనం అడగలేమని కూడా సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. 

చక్రవడ్డీ వసూలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్, సుభాష్‌ రెడ్డి, ఆర్‌షా కూడిన  అత్యున్నత ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. వడ్డీ మినహాయింపుపై వడ్డీని రూ .2 కోట్ల వరకు  కేంద్రం పరిమితం చేసిందని సుప్రీం గుర్తు చేసింది. అలాగే ఈ ఆరు నెల‌ల కాలానికి రుణ గ్ర‌హీత‌లనుంచి చక్రవడ్డీ వ‌సూలు చేయొద్దని తెలిపింది. మార‌టోరియం కాలాన్ని పొడిగించ‌డం, మొత్తం వ‌డ్డీ మాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఖాతాదారుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు బ్యాంకులు వ‌డ్డీ చెల్లిస్తాయి, మరి అలాంట‌ప్పుడు బ్యాంకులు రుణాల‌పై పూర్తిగా వ‌డ్డీని ఎలా  మాఫీ చేయగలవని సుప్రీం ప్ర‌శ్నించింది.

గ‌తేడాది భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) విధించిన మార‌టోరియం 2020 ఆగ‌స్టుతో ముగిసింది. రుణాల‌పై వ‌డ్డీ వ‌సూళ్ల మీద మార‌టోరియం పొడిగించ‌డానికి కేంద్ర ఆర్ధిక‌శాఖ‌, ఆర్బీఐ నిరాక‌రించాయి. ఇప్ప‌టికే రూ.2 కోట్ల వ‌ర‌కు రుణాల‌పై కేంద్రం వ‌డ్డీ మాఫీ చేసిన సంగతి తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top