శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం | Kerala Travancore Trust Alert On Makarajyoti Darshan At Sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకరజ్యోతి దర్శనంపై కీలక నిర్ణయం

Jan 4 2024 7:48 AM | Updated on Jan 4 2024 8:49 AM

Kerala Travancore Trust Alert On Makarajyoti Darshan At Sabarimala - Sakshi

తిరువనంతపురం: కేరళలోని శబరిమల దర్శనానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. 

వివరాల ప్రకారం.. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. పంబా నుంచి శబరి పీఠం వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో, గంటల తరబడి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. భక్తుల రద్దీ విషయంలో దేవస్థానం ట్రస్ట్‌(ట్రావెన్‌కోర్‌ దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతి సందర్శనం రోజున దర్శనాలపై కొత్త నిబంధనలను విధించింది. 

మకరజ్యోతి వీక్షణం కోసం 50వేల మందికే అనుమతి ఇస్తామని ట్రస్ట్‌ పేర్కొంది. మకరజ్యోతి దర్శనానికి మహిళలు, పిల్లలు రావొద్దని అలర్ట్‌ చేసింది. అలాగే, ఈనెల 14వ తేదీన 40వేల మందికి, 15వ తేదీన 50వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ట్రస్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న వారికే దర్శనం అని స్పష్టం చేసింది. 

ఇక ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement