సీఎం విజయన్‌కు తలబొప్పి

Kerala CM Pinarayi involved in gold smuggling case - Sakshi

కేరళ ముఖ్యమంత్రికి గోల్డ్‌ స్మగ్లింగ్‌తో సంబంధం 

స్పీకర్, ముగ్గురు మంత్రులకూ ప్రమేయం   

హైకోర్టుకు కస్టమ్స్‌ శాఖ నివేదిక

కొచ్చి: ఎన్నికల నేపథ్యంలో, బంగారం అక్రమ రవాణా కేసు తాజా పరిణామాలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్‌ పి శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులను గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టు కస్టమ్స్‌ చీఫ్‌ కేరళ హైకోర్టుకి సమర్పించిన రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ సహా మరో ముగ్గురు మంత్రులు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు స్వప్నా సురేశ్‌ దర్యాప్తులో వెల్లడించిన విషయం రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు కీలక ప్రచార అస్త్రంగా మారనుంది.

అయితే అధికార సీపీఎం మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌లు యుఏఈ కాన్సుల్‌ జనరల్‌ సహాయంతో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు కీలక నిందితురాలు స్వప్న సురేశ్‌ స్పష్టం చేశారని, కస్టమ్స్‌ కమిషనర్‌ సుమిత్‌ కుమార్, కేరళ హైకోర్టుకి సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ మాజీ ఫైనాన్స్‌ చీఫ్, ఒమన్‌లోని మస్కట్‌కు 1,90,000 అమెరికన్‌ డాలర్లను(1.30 కోట్ల రూపాయలను) అక్రమ రవాణా చేసినట్లు డాలర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో సహ నిందితులుగా ఉన్న స్వప్నా సురేశ్, సరిత్‌ పిఎస్‌లను, డాలర్‌ కేసుతో సంబంధం ఉన్నదన్న కారణంగా కస్టమ్స్‌ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు.  విజయన్‌కి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చెన్నితాల అన్నారు.

ఏప్రిల్‌ 6న జరిగే ఎన్నికల్లో కేరళలో తిరిగి లెఫ్ట్‌ ప్రభుత్వం వస్తుందని రూఢీ కావడంతోనే బీజేపీ ఆందోళనలో పడిందని సీపీఎం ఆరోపించింది. సీఎం విజయన్, ప్రధాన కార్యదర్శి, ఆయన వ్యక్తిగత సిబ్బందితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్టు స్వప్న సురేశ్‌ పేర్కొన్నట్టు కస్టమ్స్‌ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ ఆదేశాల మేరకు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసిన విషయం తనకు తెలుసునని స్వప్న  అంగీకరించినట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ వెల్లడించారు. ‘‘కాన్సులేట్‌ సాయంతో, ముఖ్యమంత్రి, స్పీకర్‌లు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన విషయం తెలుసునని ఆమె స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్‌ల అసంబద్ధమైన, అక్రమ కార్యకలాపాలను గురించి ఆమె బహిరంగపరిచారు’’అని కస్టమ్స్‌ అధికారులు హై కోర్టుకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 5న తిరువనంతపురంలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కాన్సులేట్‌కు వస్తోన్న పార్శిల్స్‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్‌ రాకెట్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసుతో సంబంధం ఉన్న స్వప్నా సురేశ్‌ సహా 15 మందిని అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top