బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రిగా సేవలందిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీ సుధాకర్ (66) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో సుదీర్ఘ కాలంగా బాధపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రాణాలు తీసిన తీవ్రమైన ఇన్ఫెక్షన్
గత మార్చి నెలాఖరు నుంచి మంత్రి డీ సుధాకర్ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో ఉన్న ప్రముఖ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలో ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో చేరి, గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఎక్మో సహా అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) చేసే అవకాశాలను కూడా వైద్యులు పరిశీలించారు.
తెల్లవారుజామున ఆగిన శ్వాస
అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, సుధాకర్ శరీరం చికిత్సకు సహకరించలేదు. కిమ్స్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిన్నదురై విడుదల చేసిన అధికారిక హెల్త్ బులిటెన్ ప్రకారం.. ‘66 ఏళ్ల గౌరవ మంత్రి సుధాకర్ డీ, ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో మరణించారు’ అని ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అంచెలంచెలుగా ఎదిగి..
చిత్రదుర్గ జిల్లాకు చెందిన డీ సుధాకర్.. ప్రస్తుతం హిరియూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో చల్లకెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నిక కాగా, ఆ తర్వాత 2008, 2013లో హిరియూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సామాజిక సంక్షేమం, యువజన వ్యవహారాలు వంటి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యతలు వహించారు. ప్రజలతో ఎంతో మమేకమై పనిచేసే నాయకునిగా పేరొందిన సుధాకర్ మృతి పట్ల అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్?


