వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అదృశ్యం సంచలనంగా మారింది. గత ఫిబ్రవరిలో టెహ్రాన్‌పై జరిగిన భారీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన.. ప్రస్తుతం ఓ రహస్య ప్రాంతం నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబు పేల్చాయి. బహిరంగంగా ఎక్కడా కనిపించనప్పటికీ, తెరవెనుక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయన యుద్ధాన్ని, శాంతి చర్చలను శాసిస్తున్నారనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.
తీవ్ర గాయాలతో ప్రాణాపాయం?
తండ్రి అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, ఫిబ్రవరి 28 దాడుల తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్సలు అందుకుంటున్న స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని, కేవలం భద్రతా కారణాల దృష్ట్యానే బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వాదిస్తున్నారు. ఈ విరుద్ధ ప్రకటనలతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎడతెగని మిస్టరీ కొనసాగుతోంది.
ట్రాకింగ్ భయం.. టెక్నాలజీకి దూరం
శత్రువుల కళ్లుగప్పేందుకు ఖమేనీ అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన పూర్తిగా పక్కనబెట్టారు. తన ఉనికిని ఎవరూ పసిగట్టకుండా ఉండేందుకు, కేవలం అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల ద్వారా, భౌతిక సందేశాల రూపంలోనే ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాలతో నడుస్తున్న కాల్పుల విరమణ చర్చల సమయంలో, శత్రువులు తన జాడను ట్రాక్ చేయకుండా ఆయన ఈ పాతకాలపు పద్ధతిని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అసలు ఇరాన్‌ను శాసిస్తున్నది ఎవరు?
ఖమేనీ కనుమరుగైన నేపథ్యంలో, ఇరాన్ అధికార యంత్రాంగంలో చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం లీడర్ కార్యాలయం పేరుకే పెద్దదైనా, క్షేత్రస్థాయిలో పాలన, కార్యకలాపాల నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్లు, ఇతర రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య చర్చల వంటి వ్యవహారాల్లో మొజ్తబా ఖమేనీ నిర్ణయాలే అంతిమమని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పేరును సైనికాధికారులు కేవలం ప్రతీకాత్మకంగా వాడుకుంటున్నారని అనుమానిస్తున్నారు. రెండు నెలలు గడుస్తున్నా ఖమేనీ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇది కూడా చదవండి: ‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!


