కర్ణాటకలో క్వారీల దందా  | Karnataka Illegal Quarries: More Than 2000 Cases Filed in Five Years | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో క్వారీల దందా 

Jan 28 2021 7:15 PM | Updated on Jan 28 2021 8:05 PM

Karnataka Illegal Quarries: More Than 2000 Cases Filed in Five Years - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అక్రమ క్వారీల జాతర నడుస్తోంది. వివిధ జిల్లాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమార్కులు కొండలను కరిగించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వారీల్లో పేలుళ్ల కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బ తింటోంది. దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పేలుళ్లకు జిలెటిన్‌స్టిక్స్‌ను ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. ఒకేసారి అధిక మొత్తంలో కొండలను పిండి చేసేందుకు అధిక పేలుడు సామర్థ్యం ఉన్న జిలిటిన్‌స్టిక్స్‌ను వినియోగిస్తున్నారు. శివమొగ్గ జిల్లా హుణసోడు సమీపంలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ క్వారీలు, నిబంధనలు పాటించకుండా సాగుతున్న జిలెటిన్‌స్టిక్స్‌ రవాణాపై ప్రజల్లో చర్చ మొదలైంది.  

ఏయే జిల్లాల్లో.. 
మండ్య, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, శివమొగ్గ, చామరాజనగర, బీదర్, దక్షిణ కన్నడ తదితర జిల్లాల్లో అక్రమ క్వారీలు భారీగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ, నాగమంగల, కే.ఆర్‌.పేట తాలూకాలోని ఇలా జిల్లాలోని అనేక చోట్ల అక్రమ రాళ్ల క్వారీల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల వల్ల క్వారీల సమీప గ్రామాల్లోని ఇళ్లు దెబ్బ తింటున్నాయి. తవ్వకాలను నిషేధించాలని పేదలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ క్వారీలపై అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహిస్తుంటారు. ఐదేళ్ల కాలంలో అక్రమ క్వారీలపై సుమారు 2,450 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 1,126 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. గనులు, భూగర్భ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో దాడులు నిర్వహించి అక్రమంగా ఖనిజాన్ని తరలిస్తున్న 7,938 వాహనాలను జప్తు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారు. క్వారీ నిర్వాహకులకు అటవీ సంరక్షణ చట్టం 1980 2(1), 2(3), అటవీ సంరక్షణ చట్టం 2003 (6), కేంద్ర, పరిసర శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సుమారు 20 లేదా 30 ఏళ్లకు సరిపడా అనుమతి ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక వ్యాప్తంగా సుమారు 13 వేల ఎకరాల్లో వేల సంఖ్యలో కాంట్రాక్టు పద్ధతిన క్వారీలు కొనసాగుతున్నాయని అధికారుల ద్వారా తెలిసింది.  

రాజకీయ నేతల అండ 
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు క్వారీ నిర్వాహకులే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటారని సమాచారం. ఈ క్రమంలో క్వారీలు నిర్వహించే వారిపై ఎన్ని కేసులు నమోదైనా తప్పిస్తూ ఉంటారని ఆరోపణలున్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నట్లు తేలితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించేందుకు చట్టంలో అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఒకరికి కూడా శిక్ష పడిన దాఖలా లేదు.  

ఇష్టానుసారంగా జిలెటిన్‌స్టిక్స్‌ తరలింపు 
ఇక క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్‌స్టిక్స్‌ను సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్‌స్టిక్స్‌ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అత్యధిక ప్రమాణాల్లో పేలుడు పదార్థాల నిర్వహణకు అనుమతి లేదు. ఒక చోట నుంచి మరో స్థలానికి పేలుడు పదార్థాల రవాణాకు జిల్లా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్‌ తదితర వస్తువులను ప్రత్యేకంగా నిల్వ ఉంచాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడు పదార్థాలను మిగతా వాటితో కలపకూడదు. అనుమతులు పొందిన తర్వాతనే క్వారీల్లో బ్లాస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి జాగ్రత్తలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. 


సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement