జబల్పూర్ ‘క్రూయిజ్’ ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురి జలసమాధి
న్యూఢిల్లీ/జబల్పూర్: బంధువుల గృహ ప్రవేశం వేడుకలో కుటుంబంతో కలిసి ఆనందం గడిపిన ఒక ఇల్లాలి జీవితం అనూహ్యంగా ఒక చిన్నపాటి విహారయాత్రతో తలకిందులైంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలోని నర్మదానదిపై బర్గీ జలాశయంలో జరిగిన క్రూయిజ్ పడవ ప్రమాదఘటనలో ఢిల్లీకి చెందిన మెరీనా, ఆమె నాలుగేళ్ల కుమారుడు త్రిషాన్, తల్లి మాధుర్ మసే జలసమాధి అయ్యారు.
గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘోర ప్రమాదం తాలూకు వివరాలను మెరీనా సోదరుడు కుల్దీప్ మోహన్ కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. 39 ఏళ్ల మెరీనా కుటుంబం ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో బంధువుల గృహప్రవేశం వేడుక తర్వాత వెంటనే ఢిల్లీకి తిరుగుప్రయాణంకావాల్సి ఉంది.
కానీ బర్గీ జలాశయంలో బోటుషికారు బాగుంటుందని చెప్పడంతో షెడ్యూల్ మార్చుకుని అమ్మ మాధుర్, బావ ప్రదీప్, సోదరి మెరీనా, మేనల్లుడు త్రిషార్, మేనకోడలు సియా, నాన్న జూలియస్ అందరూ క్రూయిజ్ పడవ ఎక్కారు. క్రూయిజ్ మొదటి అంతస్తులోకి మా కుటుంబం ఎక్కింది. నాకు సోదరి వీడియోకాల్‌చేసి జలాశయం, ప్రకృతిఅందాలను వీడియోకాల్‌లో చూపిస్తోంది. హఠాత్తుగా బోటు అటూ ఇటూ ఊగడం మొదలైంది.
దీంతో సోదరి ‘కాపాడండి కాపాడండి’ అని గట్టిగా ఏడ్వడం మొదలెట్టింది. వెంటనే వీడియోకాల్ కట్‌అయింది. ఆ తర్వాత వాళ్లను చూడనేలేదు’’ అని కుల్దీప్ కంటతడిపెట్టుకున్నారు. ‘‘అలల తాకిడి ఒక్కసారిగా ఎక్కువవడంతో భయంతో మొదటి అంతస్తులోని వారంతా కిందకు దిగారు. పడవలోకి నీళ్లు వేగంగా రావడం మొదలైంది. ఇది చూసిన మా బావ ప్రదీప్ వెంటనే పడవలో లైఫ్‌జాకెట్లు ఎక్కడున్నాయా అని వెతకడం మొదలెట్టారు. అవి కట్టకట్టి ఉండటంతో వెంటనే విప్పేసి అందరికీ పంచేశారు.
కొందరు లైఫ్‌జాకెట్లు వేసుకునేలోపే పడవలోకి మరింతగా నీరుచేరింది. దీంతో పడవతోపాటే మునిగిపోతామనే భయంతో కొందరు బయటకు దూకేశారు. దూకిన వాళ్లను సమీపం నుంచి చూస్తున్న గ్రామస్థులు తాళ్లతో లాగి ఎలాగోలా కాపాడారు. మా నాన్నను కూడా కాపాడారు. కాస్తంత ఈత వచ్చిన మా బావ మాత్రం మేనకోడలిని ఎలాగోలా కాపాడాడు. మేనల్లుడు, అమ్మ, సోదరిని కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే పడవ బోల్తాపడటంతో వాళ్లంతా దాని కింద చిక్కుకుపోయి మునిగిపోయారు’’ అని కుల్దీప్ ఏడుస్తూ చెప్పారు.
యెల్లో అలర్ట్ ఉన్నా పట్టించుకోలేదు
‘‘జలాశయంలో అలల ఉధృతి భారీగా ఉండొచ్చని అంతకుముందే యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఆ విషయం అక్కడ ఉన్న పర్యాటకులు ఎవరికీ తెలీదు. పడవ నిర్వాహకులకు తెలిసినా మాకు చెప్పలేదు. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో పడవలోకి జనాన్ని ఎందుకు ఎక్కించారు? ప్రమాదమని తెలిసి ఎవరైనా ఎక్కుతారా?’’ అని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘పర్యాటక ప్రదేశంలో శాశ్వత ఎమర్జెన్సీ రెస్క్యూ బృందం ఉండాలి. కానీ గర్గీ జలాశయం వద్ద అలాంటి ఏర్పాట్లే లేవు. ఘటనాప్రాంతం తీరం నుంచి 150–200 మీటర్ల దూరంలో ఉంది. నీటిలోకి దూకిన వాళ్లను బలమైన అలలు వెనక్కి లాగేశాయి. కనీసం ఎమర్జెన్సీ బృందం ఉంటే కాపాడగలిగేవాళ్లు’’ అని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదాయం ఒక్కటే ధ్యాస
‘‘జనాల దగ్గర భారీగా టికెట్ ఫీజు వసూలు చేస్తూ ఆదాయం మీద మాత్రమే దృష్టిపెట్టారు. పర్యాటకుల భద్రత గాలికి వదిలేశారు. పడవలోకి నీళ్లు వస్తున్నప్పుడు క్రూయిజ్‌ను నడిపే డ్రైవర్‌కు సమీప గ్రామస్థులు గట్టిగా అరుస్తూ సూచనలు చేస్తూనే ఉన్నారు. ఫలానా దిశలోకి పడవను పోనిస్తే క్షేమంగా బయటపడతారని చెబుతున్నా డ్రైవర్ విన్పించుకోలేదు. వేరే దిశలోకి పడవను పోనిచ్చి అంతా జలసమాధి కావడానికి కారకుడయ్యాడు’’ అని మృతుల బంధువు సంగీతా కోరీ ఆవేదన వ్యక్తంచేశారు.
అది నకిలీ ఫొటో
నాలుగేళ్ల త్రిషాన్‌ను తల్లి మెరీనా పొదిమిపట్టుకుని అలాగే జలసమాధి అయిన విషాదఘటనలో రెండ్రోజులుగా సామాజికమాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో నకిలీదని స్పష్టమైంది. అది కృత్రిమమేథ సాయంతో సృష్టించిన ఏఐ ఫొటో అని తేలింది. వాస్తవానికి పడవకింద చిక్కుకుపోయి నీటిలో ప్రాణాలుకోల్పోయిన తల్లి, కుమారుల మృతదేహాలను బయటకు తీసుకొచ్చినప్పటికే బాగా ఉబ్బిపోయాయని రెస్క్యూ బృందాలు వెల్లడించాయి. ‘‘ఏఐ జనరేటెడ్ ఫొటోలో చూపినట్లుగా కుమారుడిని తల్లి గట్టిగా పొదిమిపట్టుకోలేదు. నిజానికి వాళ్ల శరీరాలు బాగా ఉబ్బిపోయాయి. కానీ ఇద్దరూ లైఫ్‌జాకెట్లు ధరించి ఒకేజతగా పడవ అడుగున నీటిలో ప్రాణంపోయి కన్పించారు’’ అని వీళ్ల మృతదేహాలను బయటకు లాగిన రెస్క్యూటీమ్ సభ్యుడు వెల్లడించారు.
11కు పెరిగిన మరణాల సంఖ్య
పడవ ప్రమాదంలో శనివారం సాయంత్రం మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను జలాశయం నుంచి బయటకు తీశారు. దీంతో మరణాల సంఖ్య 11కు పెరిగింది. ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని సబ్ డివిజనల్ ఆఫీసర్ అంజుల్ అయాంక్ మిశ్రా తెలిపారు. ఆరేళ్ల విరాజ్ సోనీ, ఐదేళ్ల తమిళ్ మృతదేహాలను శనివారం వెలికితీశారు. తమిళ్ తండ్రి కామరాజ్, కామరాజ్ మేనల్లుడు మయూరమ్(5)ల జాడ తెలియాల్సి ఉంది. కామరాజ్ ఖమారియాలోని ఆర్డినన్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఘటన జరిగినప్పుడు 41 మంది ప్రయాణికులు ఉన్నారని వారిలో 28 మందికి కాపాడామని అధికారులు తెలిపారు. ఆగ్రా నుంచి వచ్చిన 20 మంది సైనిక గజ ఈతగాళ్లు సహా 200 మంది అన్వేషణ, సహాయక సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు.


