
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. ఇందుకోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అవసరమైన చర్యలు చేపట్టింది. వాస్తవానికి ఆదివారం రాత్రే ఫలితాలను విడుదల చేయాల్సిన ఉన్నా సాంకేతిక సమస్యలతో నిలిపేశారు.
గత నెలలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా.. ఇక తెలంగాణ నుంచి 73,782 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 70 వేల మంది వరకు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి 4 విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో తొలుత జరగ్గా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా నిర్వహించనున్నారు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేస్తామని వెల్లడించింది.