‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..

Internet for all with the efforts of many organizations and governments - Sakshi

పలు సంస్థలు, ప్రభుత్వాల కృషితో అందరికీ ఇంటర్నెట్‌ 

ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు అట్టడుగు వర్గాలకూ అందేందుకు తోడ్పాటు 

ఈ దిశగా కృషి చేస్తున్న ‘ఎడిసన్‌ అలయన్స్‌’ 

ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్‌ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్‌ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్‌ అలయన్స్‌’గురించి ఈ ప్రత్యేక కథనం.. 

ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్‌ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్‌ అలయన్స్‌ (ఎసెన్షియల్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సర్వి సెస్‌ నెట్‌వర్క్‌ అలయన్స్‌’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్‌ సూపర్‌ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు.

ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్‌ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్‌ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి.

సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్‌ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్‌ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్‌ అలయన్స్‌ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. 

లక్ష్యంలో ఇప్పటికే సగం.. 
2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్‌ అలయన్స్‌ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్‌ఎకనమిక్‌ ఫోరమ్‌ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్‌ అకౌంట్‌ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది.

ఎడిసన్‌ అలయన్స్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్‌ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్‌ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్‌ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్‌ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు.

విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్‌ అలయన్స్‌ భాగస్వాములు ఆన్‌లైన్‌ విద్య, రిమోట్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. 

ఎంతమందికి.. ఏయే రకంగా? 
ఎడిసన్‌ అలయన్స్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్‌ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్‌ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్‌లైన్‌ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది.

నాణ్యమైన ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్‌ ఆధారిత పరికరాలు, ఆన్‌లైన్‌ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్‌ సేవలు లభించడం మొదలైంది. 

ముందున్న సవాళ్లు.. 
ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్‌ అలయన్స్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. 

పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు 
ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్‌ సర్వి సులను ఎడిసన్‌ అలయన్స్‌లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్‌ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్‌ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం.

‘‘ఎడిసన్‌ అలయన్స్‌లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్‌ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్‌ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభన కామినేని చెప్పారు. 

అగ్రరాజ్యంలో వెరిజాన్‌ సేవలు  
అమెరికా టెక్‌ దిగ్గజ సంస్థ వెరిజాన్‌ ఆ దేశంలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్‌ అలయన్స్‌లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్‌ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్‌ ఇన్నోవేటివ్‌ లెర్నింగ్‌ సాయంతో స్కూల్‌ డిస్ట్రిక్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.

ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ (స్టెమ్‌) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్‌ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. 

- కంచర్ల యాదగిరిరెడ్డి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top