పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్‌ ఇవ్వొచ్చు

Govt Okays Vaccination For Lactating Women - Sakshi

కోవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత వ్యాక్సిన్‌

గర్భిణిలకు వ్యాక్సిన్‌పై స్పష్టతనివ్వని కేంద్రం

సాక్షి,న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌ విధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. కరోనా బారినపడిన వారు వైరస్‌ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలని తెలిపింది. కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణుల బృందం చేసిన సిఫార్సులకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

టీకా విధానంలో తాజా మార్పులివే..
కరోనా సోకినవారు కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలి. అంతకుముందు ఇది 4-8 వారాలుగా ఉండేది. ఇప్పుడు దీన్ని 3 నెలలకు పెంచారు. 

తొలి డోసు వేసుకున్నాక కోవిడ్‌ సోకితే.. కోలుకున్న 3 నెలలకు రెండో డోసు తీసుకోవాలి. 

ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలి.

ఇతర తీవ్ర వ్యాధులతో ఆసుపత్రి, ఐసీయూలో చికిత్స అవసరమైన వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత వ్యాక్సిన్‌ వేసుకోవాలి.  

పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

కోవిడ్‌ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు.

వ్యాక్సినేషన్‌కు ముందు ఎలాంటి రాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు అవసరం లేదు. 

అయితే గర్భిణీలకు కోవిడ్‌ టీకా ఇచ్చే అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్‌ విధానంలో తాజా మార్పులను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

చదవండి: Covaxin: పిల్లలపై ప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top