 
													ముంబై: ముంబై: ముంబైలోని కుర్లా ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో 19 మంది మరణించారు. 13 మంది గాయపడ్డారు. నాయక్ సాగర్ సొసైటీలో ఉన్న ఈ భవనం సోమవారం అర్థరాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో ఒకవైపు పూర్తిగా కుప్పకూలిపోయిందని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. కూలిపోకుండా మిగిలిన భాగంలోని వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింది వెలికితీత మొదలు పెట్టారు. 10 మృతదేహాలు బయటపడ్డాయి.
మరో 9 మంది ఆస్పత్రికి తరలించేలోపే మరణించారు. భవనం బాగా పాతబడిందని, ఎప్పుడైనా కూలే ప్రమాదముందని కొన్నాళ్లుగా హెచ్చరిస్తున్నా ఎవరూ ఇళ్లు వదల్లేదని అధికారులు తెలిపారు. 2013 నుంచి బీఎంసీ నోటీసులిస్తున్నా మరమ్మతులకు కూడా అంగీకరించలేదన్నారు. రిస్క్ తీసుకొని భవనంలోనే ఉంటామని, ఖాళీ చేయబోమని చెప్పినట్టు అదనపు మున్సిపల్ కమిషనర్ అశ్విని భిండే వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
