
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు బాలికలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఒండ్రు మట్టి కోసం బకులాహి నదిలోకి దిగిన బాలికలు మునిగిపోయారు. మృతులను స్వాతి(13), సంధ్య(11), చాందిని(6), ప్రియాన్షి(7)గా పోలీసులు గుర్తించారు.
జిల్లా ప్రధాన కేంద్రం నుంచి 70 కి.మీ దూరంలో ఉన్న కుందా పోలీస్ స్టేషన్ పరిధిలోని చేతిసింగ్ కా పూర్వా గ్రామంలో ఈ సంఘటన జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (పశ్చిమ) సంజయ్‌రాయ్ తెలిపారు. తమ ఇళ్లలో సాంప్రదాయ పద్ధతిలో తమ వంటగది, గోడలకు మట్టిని పూయడానికి బాలికలు నది నుంచి మట్టిని సేకరించడానికి వెళ్లారు.
నది ఒడ్డున తవ్వుతుండగా, బాలికలు లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికలను బయటకు తీశారు.. కానీ అప్పటికే ఆ నలుగురూ బాలికలు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.