మేం రెడీ.. డేట్‌ ఫిక్స్‌ చేయండి: అన్నదాతలు | Farmers Ready for Talks After PM Modi Invite Said Fix A Date | Sakshi
Sakshi News home page

మేం రెడీ.. డేట్‌ ఫిక్స్‌ చేయండి: అన్నదాతలు

Feb 8 2021 6:51 PM | Updated on Feb 8 2021 7:37 PM

Farmers Ready for Talks After PM Modi Invite Said Fix A Date - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో దాదాపు 70 రోజులుగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో రైతుల ప్రధాన డిమాండ్‌ అయిన కనీస మద్దతు ధర గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని.. రైతులు ఉద్యమం విరమించి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు ప్రధాని వ్యాఖ్యలపై స్పందించారు. చర్చలకు తాము సిద్ధమని.. డేట్‌, టైం ఫిక్స్‌ చేయాల్సిందిగా తెలిపారు. 

రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న సామ్యుక్తా కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు, రైతు నాయకుడు శివ కుమార్ కక్కా మాట్లాడుతూ.. ‘‘ప్రధాని వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. చర్చలకు మేం వ్యతిరేకం కాదు.. అలానే ఎన్నడు వెనకడుగు వేయలేదు. కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి మేం సిద్ధంగా ఉన్నాం. సరైన పద్దతిలో వారు మమ్మల్ని చర్చలకు ఆహ్వానిస్తే.. వెళ్లడానికి తయారుగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఓ డేట్‌, టైం ఫిక్స్‌ చేసి మమ్మల్ని ఆహ్వానిస్తే.. వారితో చర్చిస్తాం’’ అన్నారు. ఇక మోదీ చేసిన ‘ఆందోళన్‌ జీవి’ వ్యాఖ్యలపై కక్కా మండిపడ్డారు. సాధారణ రైతుల చేస్తోన్న ఉద్యమం గురించి ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. 

రైతులు కేంద్రం మధ్య ఇప్పటికి 11 సార్లు చర్చలు జరిగాయి. రైతుల కనీస మద్దతు ధరకు సంబంధించి ఖచ్చితమైన హామీని కోరుతున్నారు. ఇక ప్రభుత్వం ఈ నూతన చట్టాలను 12-18 నెలల పాటు అమలు నిలిపివేసేందుకు ముందుకు వచ్చినప్పటికి అన్నదాతలు ఒప్పుకోలేదు. ఇక తాజాగా సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని.. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని. ఇళ్లకు వెళ్లబోమని రైతులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

చదవండి: కనీస మద్దతు ధరపై మోదీ కీలక ప్రకటన
              సచిన్‌ ట్వీట్‌: మహారాష్ట్ర సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement