కనీస మద్దతు ధరపై మోదీ కీలక ప్రకటన

MSP Will Continue PM Modi Reaches Out to Farmers Invites Them for Talks - Sakshi

మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుంది

రైతుల ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి

సిక్కులపై మోదీ ప్రశంసలు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ చట్టాలు అమల్లోకి వస్తే.. కనీస మద్దతు ధరను పూర్తిగా ఎత్తివేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కేంద్రం రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికి ఫలితం లేకుండా పోయింది. మరోవైపు రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుందని.. ఇప్పటికైనా కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి.. వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. ఇక సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అనేది గతంలో ఉంది.. ఇప్పుడు ఉంది.. ఇక మీదట కూడా కొనసాగుతుంది. పేదలకు తక్కువ ధరకు అందించే రేషన్‌ ఇక మీదట కూడా కొనసాగుతుంది. మండీలను ఆధునీకరిస్తాము. మన  వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. ఆందోళన ఏం లేదు. ఈ వేదిక ద్వారా వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాను’’ అన్నారు. ఇక వ్యవసాయ చట్టాలపై కేంద్రం సడెన్‌గా ఇలాంటి ప్రకటన చేయడంతో విపక్షాలు యూటర్న్‌ తీసుకోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించాయి. అందుకు మోదీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన కోటేన్‌ని ఒకదాన్ని వ్యాఖ్యానించారు.

‘‘ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెటింగ్‌ వ్యవస్థ 1930లో ఏర్పాటయ్యింది. దీనిలో చాలా అంశాలు రైతులకు ప్రయోజనం లేనివి ఉన్నాయి. ఫలితంగా రైతులు తమ పంటకు ఎక్కువ రేటును పొందలేకపోతున్నారు. వీటన్నింటిని తొలగించాలనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉమ్మడి మార్కెట్‌ను తీసుకురావాలని భావించింది’’ అన్నారు. ఇక రైతుల ఉద్యమంలో విద్రోహక శక్తులు కూడా ఉన్నాయని మోదీ మరోసారి ఆరోపించారు. ‘‘దేశంలోకి ప్రస్తుతం ఆందోళన్‌ జీవి అనే కొత్త రకం వైరస్‌ ప్రవేశించింది. అది దేశంలో ఎక్కడైనా విద్యార్థులు, లాయర్లు, కార్మికులు ఆందోళన చేపడుతున్నారని తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి దాన్ని మరి కాస్త పెద్దది చేసే ప్రయత్నం చేస్తుంది. ఆందోళన అనేది వారి జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అలాంటి వారిని గుర్తించి.. వారి బారి నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అన్నారు.

ఇక ఎఫ్‌డీఐల మీద కూడా మోదీ స్పందించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంలో దేశం ఎంతో ప్రగతి సాధించిందని.. దీనిలో కూడా విద్రోహ శక్తులు చేరకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిక్కులపై మోదీ ప్రశంసలు కురిపించారు. వారు దేశానికి ఎంతో సేవ చేశారని.. దేశం వారి త్యాగాలను ఎన్నటికి మరవదన్నారు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు వారిని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాయని మోదీ ఆరోపించారు.

చదవండి: ఆశ్చర్యం: కాంగ్రెస్‌ ఎంపీపై మోదీ ప్రశంసలు
              ఇదీ మా ఎజెండా

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top