స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికి సాధనంగా వాడుకుంటున్నారు
అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెల్చుకుంటాం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధీమా
కోల్‌కతా: ఎగ్జిట్ పోల్స్ పేరుతో స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేసే కుట్ర సాగిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 200కు పైగా సీట్లు గెల్చుకోవడం తథ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఆమె శనివారం పార్టీ నేతలు, కార్యకర్తలు, కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్‌గా సమావేశమయ్యారు.
ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పని చేశారంటూ వారిని ప్రశంసించారు. టీఎంసీ గెలుపును ఎవరూ ఆపలేరని ఉద్ఘాటించారు. కచ్చితంగా 200 సీట్లకుపైగా సొంతం చేసుకోబోతున్నామని వెల్లడించారు. స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయడానికి ఎగ్జిట్ పోల్స్‌ను ఒక సాధనంగా వాడుకుంటున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు.
2021, 2024లోనూ ఇలాంటి కుతంత్రమే సాగించారని దుయ్యబట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్‌లో భారీగా కేంద్ర బలగాలను మోహరించడాన్ని, బలగాల దుందుడుకు వైఖరిని తప్పుపట్టారు. ఇది తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న క్రూరత్వంగా అభివర్ణించారు.
ఓటర్లను, ముఖ్యంగా మహిళలను భయపెట్టడానికి బీజేపీ కేంద్ర బలగాలను వాడుకుంటోందని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. జవాన్లు ప్రతి గ్రామంలోకి, వీధిలోకి వెళ్లి మహిళలపై దాడి చేశారని, పిల్లలను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియాలోని ఒక వర్గం కూడా వారికి సహకరిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉండగా, వర్చువల్ భేటీ ముగిసిన తర్వాత మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


