కేరళలో యూడీఎఫ్‌.. తదుపరి సీఎం ఇతనే? | Congress-led United Democratic Front has captured power in Kerala | Sakshi
Sakshi News home page

కేరళలో యూడీఎఫ్‌.. తదుపరి సీఎం ఇతనే?

May 5 2026 8:23 AM | Updated on May 5 2026 8:42 AM

Congress-led United Democratic Front has captured power in Kerala
  • పదేళ్ల తర్వాత అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ కూటమి 
  • సెంచరీ కొట్టేసి 102 సీట్లు దక్కించుకున్న యూడీఎఫ్‌ కూటమి 
  • 35 సీట్లకు పరిమితమై అధికారం కోల్పోయిన ఎల్‌డీఎఫ్‌ 
  • మూడు స్థానాల్లో కమలవికాసం 
  • సీఎం పదవికి పినరయి విజయన్‌ రాజీనామా 
  • సీఎం రేసులో ముందంజలో సతీశన్‌

తిరువనంతపురం: దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) కేరళలో అధికారపీఠాన్ని కైవసంచేసుకుంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్‌ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేరళలో గెలిచి కాంగ్రెస్‌ దక్షిణాదిన మూడో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కొలువుతీరిన విషయం తెల్సిందే. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన వామపక్ష పారీ్టల సారథ్యంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) కూటమి ఈసారి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. శబరిమల ఆలయ వివాదం మొదలు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి, ప్రభుత్వవ్యతిరేకత దాకా ఎన్నో అంశాలు అధికారకూటమి పుట్టిముంచాయి. దీంతో ఎల్‌డీఎఫ్‌ కూటమి కేవలం 35 చోట్ల గెలిచింది. కొన్ని జిల్లాల్లో ఎల్‌డీఎఫ్‌ పార్టీల అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. 

50 ఏళ్ల తర్వాత దేశంలో..
ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ ధాటికి ఐదేళ్లు మంత్రిపదవులు వెలగబెట్టిన వీణా జార్జ్, ఆర్‌ బిందు, కేబీ గణేశ్‌, వీఎన్‌ వాసనన్‌సహా 13 మంది నేతలు సోమవారంనాటి ఫలితాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదు. 21 మంది కేబినెట్‌ మంత్రుల్లో ముఖ్యమంత్రి విజయన్, పీఏ మొహమ్మెద్‌ రియాస్, కె.రాజన్, జీఆర్‌ అనిల్, కేఎన్‌ బాలగోపాల్, పీ.ప్రసాద్, సాజి చెరియాన్‌ మాత్రం గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ధర్మదం స్థానంలో విజయం సాధించారు. సీపీఐ(ఎం) పార్టీలో అత్యధిక మంది అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్‌(ఎం) పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఎల్‌డీఎఫ్‌ కనీ్వనర్‌ టీపీ రామకృష్ణన్‌ సైతం తన సిట్టింగ్‌ స్థానం పెరాంబ్రలో ఓడిపోయారు. కేరళలో ఓటమితో వామపక్ష పారీ్టలు తొలిసారిగా 50 ఏళ్ల తర్వాత దేశంలో మరే రాష్ట్రంలోనూ అధికారంలోలేకుండా పోయాయి. ద్విముఖ పోరుగా తయారైన కేరళలో హిందూత్వ బీజేపీ తొలిసారిగా మూడుచోట్ల విజయం సాధించి పార్టీ విస్తరణకు ఉపక్రమించింది. తిరువనంతపురం కార్పోరేషన్‌ పరిధిలోని నిమోమ్, కళాకూట్టం నియోజకవర్గాలతోపాటు కొల్లం జిల్లాలోని ఛథనూర్‌లలో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. కేరళ శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ అభ్యర్థి వీడీ సతీశన్‌ పరవూర్‌ నియోజకవర్గంలో సీపీఐ నేత ఈటీ టైసన్‌ మాస్టర్‌పై 20,600 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి 17 రౌండ్లలో వెనుకబడిన సతీశన్‌ తర్వాత పుంజుకుని జయకేతనం ఎగరేశారు. 2001 నుంచి వరసబెట్టి ఇక్కడి నుంచే సతీశన్‌ గెలుస్తున్నారు. ఈయనకు ఇది ఐదో విజయం. ఈసారి ఎన్నికల్లో అన్ని పారీ్టల నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్‌ అగ్రనేత సతీశన్‌ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. 

మెరుగుపడ్డ ఓట్ల శాతం 
ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఓట్ల శాతం బాగా మెరుగుపడింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ 28.79 శాతం ఓట్లను సాధించింది. తర్వాత సీపీఐ(ఎం) 21.77 శాతం ఓట్లను సాధించింది. తర్వాత కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ కూటమిలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌) 11.01 శాతం ఓట్లు సాధించింది. అయితే స్థానిక ఎన్నికల్లో 15 శాతం ఓట్లను సాధించిన బీజేపీ తాజా ఫలితాల్లో కేవలం 11.42 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సీపీఐ 6.64 శాతం ఓట్లు సాధించింది. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కూటమి ఓడిపోయిన వార్త తెలియగానే ముఖ్యమంత్రి పదవికి సీపీఎం అగ్రనేత పినరయి విజయన్‌ రాజీనామాచేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌కు అందజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్‌కు గవర్నర్‌ సూచించారు.

ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి

Advertisement
 
Advertisement
Advertisement