జాబిల్లిపై మరోసారి ‘విక్రమ్‌’ ల్యాండింగ్‌ | Sakshi
Sakshi News home page

జాబిల్లిపై మరోసారి ‘విక్రమ్‌’ ల్యాండింగ్‌

Published Tue, Sep 5 2023 5:40 AM

Chandrayaan-3: Vikram hops on the Moon and lands safely - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్‌–3 మిషన్‌ ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండర్‌ ‘విక్రమ్‌’ను మరోసారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేశారు. మొదట దిగిన ప్రాంతంలో కాకుండా మరో చోట విక్రమ్‌ క్షేమంగా దిగినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఎక్స్‌’లో వెల్లడించింది. తాము ఇచి్చన ఆదేశాలకు విక్రమ్‌ చురుగ్గా స్పందించినట్లు తెలియజేసింది. ల్యాండర్‌ తొలిసారిగా ఆగస్టు 23న చందమామ ఉపరితలంపై విజయవంతంగా దిగిన సంగతి తెలిసిందే.

చంద్రయాన్‌–3 మిషన్‌ లక్ష్యంలో భాగంగా ల్యాండర్‌ను తాజాగా మరోచోట దించారు. కమాండ్‌ ఇచి్చన తర్వాత ల్యాండర్‌లోని ఇంజిన్లు ఫైర్‌ అయ్యాయని, తర్వాత ల్యాండర్‌ 40 సెంటీమీటర్ల మేర పైకి లేచిందని, 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ఉపరితలంపై దిగిందని ఇస్రో స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మానవ సహిత ప్రయోగాలను నిర్వహించినపుడు వ్యోమగాములను క్షేమంగా తిరిగి భూమిపైకి తీసుకురావడానికి కిక్‌ స్టార్ట్‌ వంటిదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను ఇస్రో విడుదల చేసింది.    

నిద్రాణ స్థితిలోకి ‘విక్రమ్‌’  
చందమామపై మరో రెండు మూడు రోజుల్లో లూనార్‌ నైట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ల్యాండర్‌ విక్రమ్‌ను నిద్రాణ స్థితి(స్లీప్‌ మోడ్‌)లోకి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది. సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలియజేసింది.  ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లో ఉంచడంతో అందులోని పేలోడ్స్‌ డీయాక్టివ్‌ అయినట్లు వివరించింది. ల్యాండర్‌ రిసీవర్స్‌ మాత్రం చురుగ్గా పని చేస్తున్నట్లు తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై సౌరశక్తి తగ్గిపోయి, బ్యాటరీ అయిపోయిన తర్వాత ల్యాండర్‌ విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞాన్‌ పూర్తిగా స్లీప్‌ మోడ్‌లో ఉంటాయని ఇస్రో స్పష్టం చేసింది. చంద్రుడిపై రాత్రి ముగిసిపోయి, తిరిగి  పగలు మొదలయ్యాక  22న ల్యాండర్, రోవర్‌ స్లీప్‌ మోడ్‌ నుంచి బయటకు వస్తాయని ఇస్రో అంచనా వేస్తోంది.  లూనార్‌ డే మొదలైన తర్వాత ల్యాండర్, రోవర్‌ మళ్లీ పనిచేస్తాయా అంటే చెప్పలేమని ఇస్రో సైంటిస్టులు అంటున్నారు. మళ్లీ పని చేస్తే చంద్రయాన్‌–3 ప్రయోగం కొనసాగుతుంది. లేనిపోతే కథ ముగిసినట్లే. 

Advertisement
 
Advertisement