చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించగా, ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన బుస్సీ ఎన్ ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఒకప్పుడు విజయ్ అభిమాన సంఘాల నాయకునిగా ప్రత్యర్థుల ఎగతాళికి గురైన ఆనంద్, నేడు చెన్నై గుండెకాయ లాంటి త్యాగరాయ నగర్ (టీ నగర్) నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పుదుచ్చేరి నుంచి ‘బుస్సీ’ ప్రస్థానం
బుస్సీ ఆనంద్ రాజకీయ ప్రస్థానం పుదుచ్చేరిలో అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది. 2006లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ తరపున ‘బుస్సీ’ నుంచి పోటీ చేసి, డీఎంకే అభ్యర్థిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం పేరే ఆయన ఇంటి పేరుగా మారి, చివరకు ఆయన పేరు ‘బుస్సీ ఆనంద్’గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత విజయ్ మీద ఉన్న అభిమానం, ఆయనపై ఉన్న నమ్మకంతో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి మొదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ స్థాపన నాటి నుండి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
టీ నగర్ కోటలో అద్భుత విజయం
చెన్నైలో అత్యంత రద్దీగా ఉండే, వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన టీ నగర్ నియోజకవర్గంలో ఆనంద్ విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆయన తన వశం చేసుకున్నారు. డీఎంకే అభ్యర్థి రాజా అన్బళగన్‌ను ఢీకొట్టి, 51,632 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘విజిల్’ గుర్తుపై పోటీ చేసిన ఆనంద్, స్టార్ క్యాండిడేట్లను సైతం పక్కకు నెట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. గతంలో ఆయన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు సైతం ఈ గెలుపు చూసి ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.


