
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకింగ్, భీమా, పోస్టల్ సేవలు మొదలుకొని, బొగ్గు గనుల వరకు వివిధ రంగాలకు చెందిన కార్మికులు బుధవారం(జూలై 9) జరిగే భారత్ బంద్‌లో పాల్గొంటారని ఆయా కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు 10 కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపునిచ్చింది.
కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేస్తున్న ‘భారత్ బంద్'గా కార్మిక సంఘాలు దీనిని పేర్కొన్నాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని దేశంలోని కార్మికులకు కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొంటారని భావిస్తున్నామని, దేశవ్యాప్తంగా రైతులు, గ్రామీణ కార్మికులు కూడా నిరసనలో పాల్గొంటారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నేత అమర్‌జీత్ కౌర్ మీడియాకు తెలిపారు.
‘భారత్ బంద్’ కారణంగా బ్యాంకింగ్, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రాష్ట్ర రవాణా సేవలు ప్రభావితం కానున్నాయని హింద్ మజ్దూర్ సభకు చెందిన హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపారు. గత ఏడాది కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు వివిధ యూనియన్లు సమర్పించిన 17 డిమాండ్లను నెరవేర్చాలంటూ భారత్ బంద్ చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను విస్మరించిందని, గత దశాబ్ద కాలంగా వార్షిక కార్మిక సదస్సును నిర్వహించడంలో విఫలమైందని పలు యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక కోడ్‌లు వారి హక్కులను హరించడానికి రూపొందించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కోడ్‌లు యూనియన్ కార్యకలాపాలను బలహీనపరచడం, పని గంటలను పెంచడం , కార్మిక చట్టాల ప్రకారం యజమానులను జవాబుదారీతనం నుండి రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. కాగా కార్మిక సంఘాలు గతంలో 2020, నవంబర్ 26న, 2022,మార్చి 28, 29 తేదీలలో, గత ఏడాది ఫిబ్రవరి 16న ఇదేవిధమైన దేశవ్యాప్త సమ్మెలను నిర్వహించాయి.