అన్నదాతల కోసం మరో కేంద్ర పథకం

Benefits Of PM Kisan Maan Dhan Yojana Scheme - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీని కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అలాగే ఇప్పుడు రైతుల కోసం మరో పథకం కూడా అందుబాటులో ఉంది. గతంలోనే అన్నదాతల కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల చాలా తక్కువ మంది రైతుల మాత్రమే ఇందులో చేరారు.(చదవండి: రైతులకు భారీ ఊరట: రుణ మాఫీ)

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనేది చిన్న, ఉపాంత రైతుల సామాజిక భద్రత కోసం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం. 18 నుండి 40 సంవత్సరాల వయస్సులోపు 2 హెక్టార్ల వరకు సాగు చేయగల భూములను కలిగి ఉన్న చిన్న, ఉపాంత రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తరువాత రైతులకు నెలకు 3000/- రూపాయల కనీస భరోసా పెన్షన్ లభిస్తుంది. రైతు మరణిస్తే రైతు జీవిత భాగస్వామికి 50శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందటానికి అర్హత ఉంటుంది. 

18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల చందాదారులు 60ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు 60 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ప్రతి నెల సంబంధిత వ్యక్తి యొక్క పెన్షన్ ఖాతాలో రూ.3వేలు జమ అవుతాయి. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా/PM-కిసాన్ ఖాతా, పొలం పాస్‌బుక్, రెండు ఫోటోలు ఉంటే సరిపోతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌లో ఉన్నా వారు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉచితంగానే ఈ పథకంలో చేరవచ్చు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top