Azadi Ka Amrit Mahotsav: జెండా ఎగరేస్తున్నారా.. ఇవీ గుర్తుంచుకోండి

Azadi Ka Amrit Mahotsav: Rules for displaying the National Flag explained - Sakshi

మన జాతీయ జెండా.. కోట్లాది మంది భారతీయులు మది మదిలో నింపుకున్న సగర్వ పతాక. ఈ జాతీయ జెండా ఎగురవేయడానికి కొన్ని నిబంధనలున్నాయి. ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా 2002లో నిబంధనలు రూపొందించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్, 1971 కూడా ఏమేం చేయకూడదో చెబుతోంది.

► 2002, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియాలోని పారాగ్రాఫ్‌ 2.2 ప్రకారం ఎవరైనా వ్యక్తి,  ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అన్ని రోజుల్లో జాతీయ జెండా ఎగురవేయొచ్చు. ఇటీవల పగలు, రాత్రి కూడా జెండా ఎగరవేయొచ్చంటూ నిబంధనలు సవరించారు.
► జాతీయ జెండా చిన్నదైనా, పెద్దదైనప్పటికీ పొడవు, ఎత్తు (వెడల్పు) నిష్పత్తి 3:2 ఉండాలి. జెండా దీర్ఘ చతురస్రంలోనే ఉండాలి.
► జెండాలో కాషాయం రంగు పైకి ఉండేలా ఎగురవేయాలి.
► చేతితో లేదా మిషన్‌పై చేసిన కాటన్, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ.. ఇలా వేటితోనైనా జెండాను రూపొందించవచ్చు.
► చిరిగిపోయిన, నలిగిపోయిన లేదంటే చిందరవందరగా ఉన్న జాతీయ జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయకూడదు.
► జాతీయ జెండాయే ఎప్పుడూ ఎత్తులో ఉండాలి. మరే ఇతర దేశాల జెండాలు కానీ, ఇతర వస్తువులు కానీ జాతీయ జెండా కంటే ఎత్తులో ఉండకూడదు.
► జాతీయ జెండా ఎగురవేసిన స్తంభాలపై ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదు.
► జాతీయ జెండాని ఒక డెకరేటివ్‌ పీస్‌గా వాడకూడదు. యూనిఫామ్‌ దుస్తుల్లా వేసుకోకూడదు. ఏ డ్రెస్‌ మెటీరియల్‌ మీద కూడా ప్రింట్‌ చేయకూడదు. నడుముకి కింద భాగంలో ధరించకూడదు.
► జాతీయ జెండా నేలపైన కానీ, నీళ్లల్లో కానీ పడేయకూడదు
► రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి వాహనాలపైన మాత్రమే జాతీయ జెండా ఉంటుంది. సొంత వాహనాలపై దానిని వాడకూడదు
► జాతీయ జెండాని మాటల ద్వారా లేదంటే చేతల ద్వారా ఎవరైనా అగౌరవపరిస్తే ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్, 1971లోని సెక్షన్‌ 2 కింద మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top