డాక్టర్‌ హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష 

7 Sentenced To Death For Neurosurgeon Murder Chennai - Sakshi

ఇద్దరికి యావజ్జీవం 

శిక్షపడిన వారిలో ప్రొఫెసర్‌ దంపతులు, ఇద్దరు కుమారులు 

చెన్నై సెషన్స్‌ కోర్టు తీర్పు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నరాల వైద్యనిపుణుడు సుబ్బయ్యను చెన్నైలో హతమార్చిన కేసులో ఏడుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ విధిస్తూ చెన్నై సెషన్స్‌ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. శిక్ష పడినవారిలో ప్రొఫెసర్‌ దంపతులు, వారి కుమారులు ఉండడం గమనార్హం. వివరాలు..తమిళనాడు, కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్‌ సుబ్బయ్య 2013 సెప్టెంబర్‌ 9న చెన్నై రాజాఅన్నామలైçపురంలోని తన క్లినిక్‌ బయట దాడికి గురై 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.

హతుడు సుబ్బయ్య మేనమామ పెరుమాళ్‌ తన సోదరికి (సుబ్బయ్య తల్లికి) కన్యాకుమారీ జిల్లా అంజుగ్రామంలోని స్థలాన్ని ఇచ్చారు. దీన్ని సమీప బంధువులు ఆక్రమించుకున్నారు. కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. 2013లో ఉద్యోగవిరమణ పొందిన డాక్టర్‌ సుబ్బయ్య న్యాయస్థానం ద్వారా బంధువులపై పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకున్నాడు. ఇందుకు కక్షకట్టిన బంధువులు కిరాయి గూండాల సహకారంతో చెన్నైలోని క్లినిక్‌ వద్ద డాక్టర్‌ సుబ్బయ్యను దారుణంగా హత్యచేశారు.

ఈ కేసులో మేనమామ రెండో భార్య కుమారుడైన ప్రొఫెసర్‌ పొన్నుస్వామి, అతని భార్య ప్రొఫెసర్‌ మేరీ పుష్పం, వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్‌ బోరిస్‌తోపాటూ న్యాయవాది విల్సన్, ప్రభుత్వ డాక్టర్‌ జేమ్స్‌ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్‌.. ఈ పదిమందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్‌ అప్రూవర్‌గా మారిపోయాడు. మొత్తం పది మంది నిందితుల్లో 9 మంది దోషులని నిర్ధారణైనట్లు చెన్నై సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది.

పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్‌ జేమ్స్‌ సతీష్‌కుమార్, ఇంజనీర్‌ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కిరాయి గూండాల్లోని కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, అతని కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడడం గమనార్హం. అప్రూవర్‌గా మారి కేసు విచారణకు సహకరించిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top