మైసూర్‌ దసరా ఉత్సవాలకు 400 ఏళ్ల చరిత్ర

400 Years Old History Of Mysore Dasara Festival - Sakshi

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఈ ఉత్సవాలను చూడటానికి ప్రపంచం నలుమూలలనుంచి జనం వస్తూ ఉంటారు. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు కర్ణాటక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ పది రోజులూ మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది. ఈ రెండూ చూడటనాకి కూడా పర్యాటకులు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో ఇసుకేస్తే రాలనంత జనంతో ప్యాలెస్‌ ప్రాంతం కిటకిట లాడేది. కానీ, ఈ సంవత్సరం అలా జరగలేదు. కరోనా ప్రభావంతో మైసూర్‌ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవాలు వెలవెలబోయే పరిస్థితి ఏర్పడింది.

400 ఏళ్లకు పైగా చరిత్ర
మైసూర్‌ ఉత్సవాలకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి దసరా ఉత్సవాలను ‘నదహబ్బ’ అని పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా మైసూర్‌లోని అమ్మవారు చాముండేశ్వరీ దేవిని పూజించటం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్ధంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్‌ రజాక్‌ తన పుస్తకంలో విజయనగర రాజులు నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ I.. 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టారని తెలుస్తోంది. 1805లో కృష్ణరాజ ఉడయార్ III సమయం నుండి దసరా నాడు మైసూరు ప్యాలస్‌లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది. 

పండుగకు నెల ముందు నుంచే..
దసరా అంటేనే పది రోజుల పండుగ. అయితే మైసూర్‌ దసరా ఉత్సవాలు చాలా ప్రత్యేకం. నెల రోజుల ముందు నుంచే మైసూరు మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా... ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్లు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా దసరాను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఆటలు, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలతో కన్నుల పండుగగా ఉత్సవాలు జరుగుతాయి.

ఉత్సవాలపై కరోనా ప్రభావం
కరోనా వైరస్‌ ప్రభావం మైసూర్‌ దసరా ఉత్సవాలపై బాగానే పడింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేవి. కానీ, ఈ సారి అలా జరగలేదు. గత శనివారం అత్యంత నిరాడంబరంగా వేడుకలు మొదలయ్యాయి. దివ్య ముహూర్తంలో చాముండిగిరుల మీద  చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు నాంది పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, కొద్ది మంది ప్రముఖులు మాత్రమే  పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top