ఆ మహిళ బండారమంతా బ్లాక్‌ ‘మెయిల్స్‌’లో.. | - | Sakshi
Sakshi News home page

ఆ మహిళ బండారమంతా బ్లాక్‌ ‘మెయిల్స్‌’లో..

Jun 21 2026 7:10 AM | Updated on Jun 21 2026 7:10 AM

మూడేళ్ల కిందటే ముగిసిన కేసుకు ఇప్పుడు బెయిల్‌ ఎలా..

డీసీసీ మాజీ అధ్యక్షుడు

కుంభం శివకుమార్‌రెడ్డి

నారాయణపేట: తనపై గతంలో నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని.. దర్యాప్తు సంస్థలు వాటిని కొట్టివేసినా రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని డీసీసీ మాజీ అధ్యక్షుడు, నారాయణపేట కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి ఆరోపించారు. సదరు మహిళ తనకు చేస్తున్న మెయిల్స్‌ను బ్లాక్‌ చేశానని.. అవన్నీ స్పామ్‌ మెసేజ్‌లోకి వెళ్తున్నాయని.. ఈ నెల 6న తనకు పంపిన మెయిల్స్‌తో పాటు పూర్తిస్థాయిలో సదరు మహిళను విచారిస్తే ఆమె బండారమంతా బయటపడుతుందన్నారు. అదే విధంగా మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో అనేది తేలిపోతుందని పేర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేటలో తనపై గతంలో ఉన్న కేసుకు సంబంధించిన పలు పత్రాలను మీడియా ఎదుట ఉంచుతూ తన వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్నది న్యాయపోరాటం కాదని, బ్లాక్‌మెయిల్‌ రాజకీయమని ఆరోపించారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ ప్రక్రియను దెబ్బతీసే ఉద్దేశంతోనే తన పేరును వివాదంలోకి లాగారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత స్పెన్సర్‌లాల్‌ తెలంగాణకు వచ్చి తనపై ఆరోపణలు చేసిన సదరు మహిళతో మాట్లాడి వెళ్లారని.. ఆ తర్వాతే తాను రూ. 10కోట్ల పరువునష్టం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సదరు మహిళ ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. తనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, చిట్టెం అభిజయ్‌రెడ్డి పేర్లను కూడా ప్రైవేట్‌ పిటిషనన్‌లో చేర్చడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. పార్టీకి అన్ని విషయాలు తెలుసని.. ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకంతోనే తనపై చర్యలు తీసుకోలేదన్నారు. మూడేళ్ల క్రితమే ముగిసిపోయిన కేసుకు ఇప్పుడు బెయిల్‌ తీసుకున్నానని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. పోలీస్‌ వ్యవస్థ, న్యాయస్థానాలపై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. తనపై నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే ఆ మహిళకు సంబంధించిన అన్ని విషయాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తానని కేఎస్‌ఆర్‌ హెచ్చరించారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు, సోషల్‌ మీడియా ప్రచారాలు, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తాను తప్పుచేసి ఉంటే ప్రజల ముందుకు వచ్చేవాడిని కాదని వ్యాఖ్యానించారు. తాను పొలిటికల్‌గా ఓడిపోయి ఉండొచ్చని.. కానీ ప్రజలకు సేవచేసే విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ఇంజినీర్‌గా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేశానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కథనాలు ప్రసారం చేస్తే సహించబోనని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement