అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

Apr 17 2026 1:32 PM | Updated on Apr 17 2026 1:32 PM

అధికారులు బాధ్యతగా పనిచేయాలి

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

కోస్గి రూరల్‌: కోస్గి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంటే.. అధికారులు మాత్రం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, ఆర్‌ఆండ్‌బీ, విద్యుత్‌శాఖ అదికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ అబివృద్ధి కోసం కేటాయించిన రూ.305 కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీశారు. అదే విధంగా సీసీరోడ్లు, వీధి దీపాలు, హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటు, జంక్షన్‌ల నిర్మాణం, పార్కుల అబివృద్ధి, అప్రోచ్‌ రోడ్లు, చెరువుల సుందరీకరణ, అండర్‌ డ్రెయినేజీల నిర్మాణాలపై చర్చించారు. పండుగలు, లేబర్‌ లేరనే సాకుతో పనులను ఆలస్యంగా చేపట్టే సంబంధిత కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, బాధ్యతగా పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం 7వ వార్డులో నిర్మిస్తున్న సైన్స్‌ మ్యూజియం, పంచతంత్ర పార్కు, శివాజీ చౌరస్తాలో జంక్షన్‌ ఏర్పాటు, డంపింగ్‌యార్డు వరకు రూ.10.50 కోట్లతో సీసీరోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులను ఆయన పరీశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఎండోమెంట్‌, ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అంతకుముందు 7వ వార్డులో జరిగిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పట్టణ సభలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఫణీంద్రారెడ్డి, కడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మొగులప్ప, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వినయ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ అఽశోక్‌, అర్‌అండ్‌బీ డీఈ శ్రీహరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నాగులపల్లి నరేందర్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ సరిత, కమిషనర్‌ నాగరాజు, తహసీల్దార్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

జాగ్రత్తలు పాటించాలి

నారాయణపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ డా.వినీత్‌తో కలిసి ఏర్పాటుచేసిన రోడ్‌ సేఫ్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. జిల్లాలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ఇకపై ప్రమాదాలు జరగకుండా రోడ్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్ల పక్కనున్న పాఠశాలల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జంక్షన్ల వద్ద సూచిక బోర్డులు, హజార్డ్‌ మార్కర్లు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను ఎస్పీ డా.వినీత్‌ వివరించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటరమణ, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్టీఓ మేఘాగాంధీ, ఆర్టీఏ మెంబర్‌ పోషల్‌ రాజేశ్‌, ఆర్టీసీ డీఎం లావణ్య, డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement