‘కో–ఆప్షన్‌’ సందడి | - | Sakshi
Sakshi News home page

‘కో–ఆప్షన్‌’ సందడి

Apr 6 2026 8:48 AM | Updated on Apr 6 2026 8:48 AM

మంత్రి ఇలాకాలో పూర్తి.. మద్దూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు..

కోస్గిలో నేడు ఎన్నిక..

దరఖాస్తుల స్వీకరణకు నేటితో ముగియనున్న గడువు

నారాయణపేట: పురపాలికల్లో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం ఉంటుంది. నారాయణపేట, మద్దూరు పురపాలికల్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం సాయంత్రం గడువు ముగియనుంది. సాయంత్రం 5లోగా పుర కార్యాలయములో సమర్పించాలని మున్సిపల్‌ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఎన్నిక పూర్తి చేశారు. మద్దూరులో ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో మిగిలిన నలుగురు ఖరారైనట్లే.

పేటలో కమలం కసరత్తు..

జిల్లాలోని మూడు పురపాలికలను అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ కై వసం చేసుకోగా.. నారాయణపేటలో కమలం పాగ వేసింది. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపి అవకాశం దక్కని వారికి కో–ఆప్షన్‌ భరోసానిచ్చి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పావులు కదిపింది. ప్రస్తుతం ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరి స్థాయిలో వారు పోటీ పడుతున్నారు. మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌, కో–ఆప్షన్‌ సభ్యులుగా అనుభవం ఉన్న వారే అర్హులనే నిబంధన ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమ స్థానాలను త్యాగం చేసిన 1వ వార్డు మాజీ కౌన్సిలర్‌ అనూష, 4వ వార్డు మాజీ కౌన్సిలర్‌ జయశ్రీ సైతం తమకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడినట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్‌ కొండ శ్వేత సత్యయాదవ్‌ నాలుగో వార్డు నుంచి గెలుపొందారు. మున్సిపాలిటీలో దాదాపు అందరూ కొత్తవారే ఉండటంతో బీజేపీ తరఫున 2014లో వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన నందూనామాజీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని పార్టీ శ్రేణులు చర్చించినట్లు సమాచారం. ముస్లిం మైనార్టీ కోటాలో జమీర్‌ పాషా, మాజీ కో–ఆప్షన్‌ సభ్యుడు తాజుద్దీన్‌తో పాటు పలువురు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి సూచనలతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌కుమార్‌ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్‌ మున్సిపాలిటీలో కో–ఆప్షన్‌ ఎన్నిక పూర్తయింది. మంత్రి తనదైన శైలిలో ఎన్నిక పూర్తి చేయించడంలో సఫలీకృతులయ్యారు. కో–ఆప్షన్‌ సభ్యులుగా మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్‌, సరస్వతిబాయి, మాజీ కో–ఆప్షన్‌ సభ్యులు శంషోద్దీన్‌, హసీనాబేగం ఉన్నారు.

మద్దూరు పురపాలికలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కృష్ణయ్య, ఖయ్యూం, రొయ్యల నర్సమ్మ, శంకర్‌నాయక్‌, రబియాబేగం దరఖాస్తు చేసుకున్నారు. కాగా కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి సూచన మేరకు ఆ పార్టీ ఆశావహులు సోమవారం దరఖాస్తు చేసుకోనున్నారు.

మంత్రి ఇలాక మక్తల్‌లో పూర్తి

కోస్గిలో అభ్యర్థులు ఫైనల్‌

నారాయణపేట, మద్దూర్‌లో

కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

సీఎం ఇలాకాలోని కోస్గి పురపాలికలో నలుగురు కో–ఆప్షన్‌ సభ్యులను సోమ వారం ఎన్నుకోనున్నారు. పుర పాలకలో అనుభవం ఉన్న సభ్యుల నుంచి 4, మైనార్టీ సభ్యుల నుంచి 2 మొత్తం 6 నామి నేషన్లు వచ్చాయి. వాటిలో ఇద్దరు ఉపసంహరించుకోగా గందె ఓంప్రకాష్‌, వసంతమ్మ, సయ్యద్‌ అబ్దుల్‌ సలీం, అష్రఫ్‌ బేగం మిగిలారు. సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నిక జరపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement