అణగారినవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త, విద్య, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాల్లో కీలక సేవలందించిన గొప్ప వ్యక్తి, కులరహిత సమాజం, సామాజిక సమా నత్వానికి పోరాడిన ఆదర్శ నేత దేశ మొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివని ఎస్పీ డాక్టర్ వినీత్ కొనియాడారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలకు ఆయన హాజరై పోలీసులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సోదరభావం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు విజయభాస్కర్, సురేష్, శివశంకర్, శిరీష, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులు పాల్గొన్నారు.


