పోలీస్ అమరవీరుల త్యాగాలే స్ఫూర్తి
నారాయణపేట: పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఈ సైకిల్ ర్యాలీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి, చివరగా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ, యువత, విద్యార్థులు, చిన్నారులు, పోలీసులు, ప్రజలతో కలిసి సైక్లింగ్ చేస్తూ పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల శరీర దృఢత్వం పెరగడమే కాకుండా మనసుకు ఉత్తేజం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటే విధుల్లో మరింత సమర్థతతో రాణించవచ్చు అని అన్నారు. ఈ ర్యాలీలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐ శివశంకర్, ఆర్‌ఐ నరసింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, శివశంకర్, శ్వేత, శిరీష, కృష్ణ చైతన్య, పీఈటీ రమణ, యోగ సభ్యులు పాల్గొన్నారు.
నేడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం
జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఒకప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రెండున్నర కిలోమీటర్లు రన్నింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు, ప్రజలు, యువకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.


