మధ్యాహ్న భోజనంలో అవకతవకలు సహించం
మద్దూరు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందజేస్తుందని, ఇందులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మద్దూరు బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్.. డీఈఓ గోవిందరాజులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలించారు. ప్రతి రోజూ వచ్చే విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నజేషన్ సిస్థం) అటెండెన్స్, జనరల్ రిజిస్టర్‌కు తేడా ఉండడంతో హెచ్‌ఎం సవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన అందించే విద్యార్థుల సంఖ్యలో తేడాలపై సమగ్రమైన నివేదిక అందజేయాలని ఎంపీడీఓ శ్రీధర్‌ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, సీఎంఓ రాజేందర్‌కుమార్, మధ్యాహ్నా భోజన ఇంచార్జీ యాదయ్య, ఎంఈఓ బాలకిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మద్దూరు సీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, స్టాక్ రిజస్టర్, మందుల స్టాక్‌ను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో హాజరై వైద్య సేవలు అందించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికి స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ఓపీ రిజిస్టర్‌లో 95 మంది రోగులకు 75 మందికి మాత్రమే మందులు ఇచ్చారని అమె ప్రశ్నించగా వారికి మాత్రమే మందులు అవసరమని వైద్యులు తెలిపారు. అనంతరం రోగులతో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సేవలపై ఆరా తీశారు.


