జీపీఓలు వచ్చేశారు.. | - | Sakshi
Sakshi News home page

జీపీఓలు వచ్చేశారు..

Sep 9 2025 1:35 PM | Updated on Sep 9 2025 1:37 PM

అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డీఓ సమక్షంలో కౌన్సెలింగ్‌

సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నియామకం

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెరగనున్న పర్యవేక్షణ

గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టం

నేడు విధుల్లో చేరనున్న గ్రామ పాలన అధికారులు

నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న గ్రామ పాలన అధికారులు మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను శుక్రవారం నియమించగా.. జిల్లాకు 124 మందిని కేటాయించారు. సోమవారం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ దిశానిర్దేశంతో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఇకపై ప్రతి గ్రామ పాలన పకడ్బందీగా సాగనుంది. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసే సంక్షేమ పథకా లు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడంలో జీపీఓలు కీలకపాత్ర పోషించనున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది.

252 రెవెన్యూ గ్రామాలు.. 124 క్లస్టర్లు

జిల్లాలోని 13 మండలాల్లో 252 రెవెన్యూ గ్రామా లను 124 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్‌లో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కొక్క జీపీఓను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 124 రెవెన్యూ క్లస్టర్లకు కేటాయించిన జీపీఓలు తహసీల్దార్ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్నారు.

పక్కాగా కౌన్సెలింగ్‌..

కొత్తగా నియమితులైన జీపీఓలు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని మండలాల్లో పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు పక్కాగా కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీను తెలిపారు. ముందుగా 16మందికి స్పౌజ్‌, వికలాంగులు, సింగిల్‌ ఉమెన్‌, మెడికల్‌ సమస్యలు ఉన్నవారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత 108 మందికి వారు రాసిన జీపీఓ పరీక్షలో వచ్చిన ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌ చేపట్టారు.

జీపీఓల విధులు ఇలా..

జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో ప్రభుత్వం నియమించిన జీపీఓలు 11 రకాల జాబ్‌చార్ట్‌ అనుసరిస్తారు. భూ భారతి చట్టంలో భాగంగా భవిష్యత్‌లో ప్రతి రిజిస్ట్రేషన్‌ – మ్యుటేషన్‌కు గ్రామ పటం జోడించడంలో జీపీఓల పాత్ర కీలకంగా మారనుంది. గ్రామస్థాయిలో భూ ఖాతా (విలేజ్‌ అకౌంట్‌) నిర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృదస్త్రం నిర్వహణ, లావుణి, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ, నీటివనరుల కింద భూముల పరిరక్షణ, భూమి ఖాతాల నిర్వహణ, మార్పు, చేర్పుల నమోదు, భూ సర్వేకు దరఖాస్తు చేసుకుంటే సేవలు, ప్రకృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా, గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తదితర విధులు నిర్వర్తించనున్నారు.

సుస్థిర పాలన అందిస్తాం..

వీఆర్‌ఏ వ్యవస్థ రద్దుతో నారాయణపేట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్‌గా పనిచేశా. ప్రభుత్వం జీపీఓలను నియమించడంతో తిరిగి తమ శాఖాలోకి వచ్చినట్లయింది. తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో సుస్థిర పాలన అందించేందుకు కృషిచేస్తాం.

– జ్యోతి, జీపీఓ, బోయిన్‌పల్లి

భూ సమస్యల

పరిష్కారానికి కృషి..

భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రైతులు, అధికారులకు సరైన సమాచారాన్ని అందించి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు అయ్యేందుకు కృషిచేస్తాం. – శ్రీనివాస్‌, జీపీఓ, శేర్నపల్లి

ఆనందంగా ఉంది..

వీఆర్‌ఏగా 2012లో ఊట్కూర్‌ మండలం నిడుగుర్తిలో విధుల్లో చేరా. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో వీఆర్‌ఏ పోస్టులను రద్దు చేయడంతో నారాయణపేట మున్సిపాటీటిలో వార్డు అధికారిగా 2023 ఆగస్టు 8న పోస్టింగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం వీఆర్‌ఏలు, వీఆర్‌ఓలు మళ్లీ సొంత శాఖకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. – ఆంజనేయులుగౌడ్‌, జీపీఓ, కొల్లంపల్లి

మండలం రెవెన్యూ క్లస్టర్లు

గ్రామాలు

కోస్గి 17 7

గుండుమాల్‌ 10 4

మద్దూర్‌ 17 9

కొత్తపల్లి 11 5

దామరగిద్ద 27 13

నారాయణపేట 24 15

మాగనూర్‌ 20 9

కృష్ణా 14 8

ధన్వాడ 10 7

మరికల్‌ 14 7

మక్తల్‌ 39 20

ఊట్కూర్‌ 27 11

నర్వ 20 9

మండలాల వారీగా క్లస్టర్ల వివరాలిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement