
యూరియా కోసం తప్పని పాట్లు
ధన్వాడ/నర్వ: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల వద్దకు చేరుకొని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ధన్వాడ పీఏసీఎస్‌కు యూరియా రాకపోవడంతో నాలుగు రోజులుగా పంపిణీ చేయలేదు. సోమవారం యూరియా వస్తుందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు వేకువజామున 5 గంటలకే పీఏసీఎస్‌కు చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు ఎప్పుడు తెరుస్తారా అని గంటల తరబడి ఎదురుచూశారు. ఎట్టకేలకు పోలీసుల బందోబస్తు నడుమ పీఏసీఎస్ గేటు తీయగా.. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చారు. రైతులను నిలువరించే క్రమంలో పోలీసులు కిందపడ్డారు. రైతులను క్యూలో నిలబెట్టేందుకు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 580 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు.
● నర్వ పీఏసీఎస్‌కు రైతులు పోటెత్తారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ కట్టారు. గంటల వ్యవధిలోనే యూరియా స్టాక్ ఖాళీ కావడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఒక్క బస్తా యూరియా కోసం నిత్యం అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు.

యూరియా కోసం తప్పని పాట్లు