
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
● అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మాగనూర్, మదనాపురం, కృష్ణా, నర్వ, మక్తల్, అమరచింత, ఆత్మకూర్, ఊట్కూర్ మండలాల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వెనకబడ్డామని.. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా లబ్ధిదారులకు ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇళ్ల పురోగతిని తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,080 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 1,334 ఇళ్ల పనులను ప్రారంభించినట్లు వివరించారు. వీటిలో 13 ఇళ్లు పూర్తి కాగా.. మరో 8 ఇళ్లు చివరి దశలో ఉన్నాయన్నారు. అనంతరం మక్తల్ మండలం బోందల్‌కుంట, అంకెన్‌పల్లి, గుడిగండ్ల, రుద్రసముద్రం తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి తన నివాసంలో పంపిణీ చేశారు. నర్వ మండలం ఉందేకోడ్, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
● టీజీఎస్‌పీడీసీఎల్ ఎమర్జేన్సీ వాహనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లో ప్రారంభించారు. ప్రజలకు వేగవంతంగా విద్యుత్ సేవలు అందించేందుకు ఎమర్జేన్సీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో ఏడీఈ జగన్మోహన్‌రావు, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ హరికృష్ణ, బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఏఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కట్ట సురేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.