
రేపు తుది ఓటరు జాబితా విడుదల
నారాయణపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాల మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు జరిపి తుది ఓటరు జాబితాను వెలువరిస్తామన్నారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సలీం, బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబన్న, బీఆర్‌ఎస్, సీపీఎం, బీఎస్పీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.