
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో అధిక వర్షా లు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆహార ధాన్యాల పంటలకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల వల్ల దాదాపు 5,435 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. చిన్ననీటి వనరులకు దాదాపు రూ.629 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాలు వరద ముంపునకు గురైనట్లు తెలిపా రు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం పన్ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రధానికి తీర్మానం కాపీలు పంపాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్, హన్మంతు పాల్గొన్నారు.