
మహిళ మెడలోమంగళసూత్రం చోరీ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఫ్రీజన్ రోడ్డులో గురువారం గోదా నాగలక్ష్మి అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగులు పుస్తెలతాడు (బంగారుగొలుసు) చోరీ చేశారు. స్థానికంగా నివాసముంటున్న నాగలక్ష్మి రేషన్ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. నిర్మానుష ప్రాంతంలో మెడలోని గొలుసు చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. అనంతరం ఎన్‌ఎస్125 బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలసి పరారైనట్లు పేర్కొన్నారు. బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులు పరిశీలించారు. చోరీ అయిన గొలుసు మూడు తులాలు ఉంటుందుని బాధితురాలు వాపోయింది.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు
నవాబుపేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ జావిద్ (35), బుచ్చయ్య ఇద్దరు బుధవారం చేపల వేటకు వెళ్లారు. కాగా జావిద్ చేపల పట్టుకునే క్రమంలో చెరువు లోపలికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బుచ్చయ్య గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ విక్రమ్ గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి మరో సారి గాలింపుచర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా జావిద్‌కు భార్య అన్విర్‌తో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు.