
నీటి గుంతలో పడి అన్నదమ్ములు మృతి
ఊట్కూరు: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ఇంటిపక్కన ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి తండాకి చెందిన పూనియానాయక్, జయమ్మ దంపతులకు కుమారులు అభిషేక్(5) ఆకాష్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. సొంత గ్రామం తిమ్మారెడ్డిపల్లి తండాలో వినాయక నిమర్జనం కోసం రెండు రోజుల క్రితం వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే కాస్త దూరంలో ఉన్న నీటి గుంతలో పడిపోయారు. పిల్లలు కనపడడం లేదంటూ కుటుంబసభ్యులు గ్రామం మొత్తం వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న గంత వద్దకు వెళ్లి చూడగా అందులో చిన్నారులు తెలుతూ కనిపించారు. వెంటనే వారిని బయటికి తీసి ఆస్పత్రకి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరన్నదమ్ములు మృతిచెందడంతో తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక నిమర్జనానికి వచ్చిన చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.