
పకడ్బందీగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు
మక్తల్: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మంగళవారం మక్తల్‌లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆజాద్‌నగర్, యాదవ్‌నగర్, గాంధీనగర్ తదితర కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ఆయన దర్శించుకొని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మినీ ట్యాంక్‌బంద్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవ కమిటీల సభ్యులు నిమజ్జన వేడుకల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించి.. నిమజ్జనం పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డీజేలను నిషేధించినట్లు చెప్పారు. ఎవరైనా డీజేలు వినియోగిస్తే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ శోభాయాత్ర రూట్‌లో విద్యుత్ వైర్లతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ఎస్పీ వెంట మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, రవికుమార్ ఉన్నారు.