
సీఎం ఇలాకాలోభూసేకరణం!
సర్వే చేసేందుకు వచ్చిన అధికారి కాళ్లు మొక్కుతున్న రైతు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్‌తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎత్తిపోతలకు అడ్డంకులు.. భూసేకరణలో ప్రగతిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
ఉమ్మడి ఏపీలో రూపకల్పన..
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నారాయణపేట, మక్తల్‌తో పాటు కొడంగల్ (ప్రస్తుతం వికారాబాద్ జిల్లా) నియోజకవర్గ పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
డిజైన్‌లో మార్పు.. అయినా..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగా.. జీఓ 69 అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు.
ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన..
2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పాత డిజైన్ ప్రకారం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు.
350 మంది రైతులకు పరిహారం అందజేత..
తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
2 ప్యాకేజీలుగా పనులు..
ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్ కాల్వలు, పంప్‌హౌస్‌లు, ప్రెషర్ మెయిన్లు, లీడ్ చానెల్, డెలివరీ సిస్టర్న్‌లతోపాటు సివిల్, ఎలక్ట్రిక్ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. 2026 ఆగస్ట్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మలి దశలో కానుకుర్తి నుంచి కొడంగల్ నియోజవర్గ పరిధిలోని బొంరాస్‌పేట మండలంలోని చెరువు వరకు నీటిని తరలించనున్నారు. దీనికి టెండర్లు పిలవాల్సి ఉంది.

సీఎం ఇలాకాలోభూసేకరణం!