
పరిహారం పెంచండి సారూ..
పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణపై రైతుల నిరసన
నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరంభంలోనే రైతుల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. బహిరంగ మార్కెట్‌ను అనుసరించి 2013 చట్ట ప్రకారం తమకు భూ నష్టపరిహారం ఇవ్వాలని రైతులు భూ నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రోజుకో రీతిలో నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఊట్కూర్ మండలంలోని దంతనపల్లి, ఊట్కూర్, బాపూర్, మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి, కాచ్వర్, నారాయణపేట మండలంలోని జాజాపూర్, సింగారం, పేరపళ్ల, దామరగిద్ద మండలంలోని కాన్‌కుర్తి, పీడెంపల్లి తదితర గ్రామాల్లో రైతులు తమ ఇంటి వద్దే ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు.
బుజ్జగింపులు
భూములు కోల్పోతున్న రైతులను సముదాయించే పనిలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి నిమగ్నమయ్యారు. గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వం చెల్లిస్తున్న భూ నష్టపరిహారాన్ని తీసుకొని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.
21 గ్రామాల పరిధిలో..
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టి నాలుగు మండలాల పరిధిలో 21 గ్రామాల్లో 1957.39 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఫస్ట్ ఫేజ్‌లో పంప్‌హౌస్, సబ్‌స్టేషన్, ప్రెజర్ మెయిన్ కెనాల్‌కు 550.03 ఎకరాలు, సెకండ్ ఫేజ్‌లో జయమ్మ చెరువు రిజర్వాయర్‌కు 337.02 ఎకరాలు, థర్డ్ ఫేజ్‌లో ఊట్కూర్ చెరువు రిజార్వాయర్ కింద 311.06 ఎకరాలు, ఫోర్త్‌ఫేజ్‌లో కానుకుర్తి రిజర్వాయర్‌కు 792.04 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు.
వినూత్న రీతీలో నిరసనలు
నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో 9 రోజులుగా వినూత్న రీతీలో నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. న్యాయ నిపుణులతో కమీషన్ ఏర్పాటు చేయాలని 21 గ్రామాల్లో పంచాయతీల ఎదుట ఈ నెల 22న నిరసనలు చేపట్టి పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. 25న అర్ధనగ్న ప్రదర్శన, 26న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి, 28న కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ వెల్లడించారు.
రైతులను సముదాయిస్తున్న మంత్రి శ్రీహరి, పేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి
సహకరిస్తున్న రైతులకు చెక్కుల పంపిణీ
భూ సేకరణలో 1,957 ఎకరాల గుర్తింపు
28న కలెక్టరేట్ వద్ద అన్నదాతల శాంతియుత ధర్నా