
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
కోస్గి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రికి ప్రతిరోజు వచ్చే రోగులన రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రసవాల వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే, రక్త పరీక్షల గది, ఈసీజీ, జనరల్ వార్డులు, రికవరీ, మందుల పంపిణీ గదులను పర్యవేక్షించారు. ఆస్పత్రిలో అందే వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బంది, మందుల ఇండెంట్‌ను పంపించాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఆస్పత్రికి ఆర్వో ప్లాంట్ అవసరమని సిబ్బంది కోరగా.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని సూచించారు.
శిథిలావస్థ పాఠశాల సందర్శన
మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు. రూ.75 లక్షలతో మంజూరైన పాఠశాల నూతన భవన పనులపై ఆరా తీశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం వేరే భవనంలో కొసాగుతున్న తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం గురించి చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీని వాసులు, ఏఈ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు.
నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పరిశీలన
నారాయణపేట: జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.55 కోట్ల నిధులతో కొనసాగుతున్న కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఇప్పటి దాకా జరిగిన నిర్మాణ పనులపై ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆమె సూచించారు. భవన సముదాయ నిర్మాణ పనులతో పాటు బయట రోడ్లు, ఇతర పనులు వెంటనే ప్రారంభించి, ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రివైజ్డ్ ప్రతిపాదనలు ఉంటే పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, డీఈ శరత్‌చంద్రారెడ్డి, ఏఈ అభిలాష్ పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తాపట్నాయక్