
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు పెంచి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు రూ.6 వేలకు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీపై ప్రశ్నించే ప్రతిపక్షాలు పింఛన్ పెంచకపోవడంపై ఎందుకు నిలదీయడం లేదని విమర్శించారు. పింఛన్ల పెంచాలని కోరుతూ వచ్చే నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించ సభకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.