
భూ నిర్వాసితులను ఆదుకోవాలి
దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మల్‌రెడ్డిపల్లిలో భూములు కోల్పోతున్న రైతులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎకరాకు రూ. 30లక్షల నుంచి రూ. 50లక్షల విలువ ఉన్న భూములకు కేవలం రూ. 14లక్షలు మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, మనోహర్, మహేశ్, శివశంకర్, హుస్సేనప్ప ఉన్నారు.
అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం వివిధ పోస్టుల వారీగా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, 24వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో పరీక్షకు రావాలని సూచించారు.
ఎంవీఎస్‌లో గెస్టు అధ్యాపకుల పోస్టులు..
జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల వారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 24న తేదీన నిర్వహించే డెమోకు హాజరుకావాలని సూచించారు.
రామన్‌పాడులో 1,019 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం 1,019 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030, సమాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 894, కుడి, ఎడమ కాల్వలకు 52, వివిధ లిఫ్ట్‌లకు 872, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి
పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి తండా సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొల గిస్తున్నారు. అయితే సంబంధిత అధికారు లు స్పందించి కేఎల్‌ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్మును పూర్తి గా తొలగించాలని కోరుతున్నారు.

భూ నిర్వాసితులను ఆదుకోవాలి