
పశువైద్యం.. దైన్యం!
మరికల్: జిల్లాలో పశువైద్యం గాలిలో దీపంలా మారింది. ఓవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతుండగా.. మరోవైపు పశువైద్య కేంద్రాల్లో మందుల కొరత వేధిస్తోంది. ఏదేని జబ్బు బారినపడే పశువులు లేదా జీవాలను పశువైద్యశాలకు తీసుకెళ్తే.. వైద్యులు పరీక్షించి ప్రైవేటులో మందులు తీసుకోవాలని చీటి రాసిస్తుండటంతో పెంపకందారులపై ఆర్థిక భారం పడుతోంది. వర్షాకాలంలో పశువులు గాలికుంటు, జబ్బవాపు, గొంతువాపు.. జీవాలు గాలికుంటు, పాటురోగం ఇతర వ్యాధుల బారిన పడుతున్నాయి. పశువులకు సోకుతున్న వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు పశువైద్యశాలల్లో అందుబాటులో లేకపోవడంతో పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు సోకే వ్యాధులను నయం చేసుకునేందుకు ప్రైవేటులో మందులు కొనుగోలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. పేరుకు మాత్రమే ప్రభుత్వ పశువైద్యశాలలు ఉన్నాయని.. మందుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 16 పశువైద్యశాలలు ఉండగా.. నారాయణపేట, మక్తల్‌లో రెండు సంచార వైద్యశాలలు ఉన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రులకు తీసుకొచ్చే పశువులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేయడం మినహా వ్యాధుల నివారణకు అవసరమై న మందులను ఇవ్వలేకపోతున్నారు. చివరి సారిగా రెండేళ్ల క్రితం జీవాలకు నట్టల నివారణ మందులు వచ్చాయి. మళ్లీ నేటి వరకు నట్టల నివారణ మందులు రాలేదు. గతేడాది నవంబర్‌లో వచ్చిన అరకొర మందులతోనే పశువైద్య కేంద్రాలను నడిపిస్తున్నారు. అక్కడ లేని మందులను ప్రైవేటు దుకాణాల్లో తీసుకోవాలంటూ వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు దుకాణాల నిర్వాహకులు అధిక ధరలకు మందులు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వ్యాధులకు అవసరమైన మందులను పశువైద్యశాలలకు సరఫరా చేయాలని కోరుతున్నారు.
పశువైద్యశాలల్లోవేధిస్తోన్న మందుల కొరత
ప్రైవేటులో తీసుకోవాలని చీటి రాసిస్తున్న వైద్యులు
ఇబ్బందులు పడుతున్న పశుపోషకులు
పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు

పశువైద్యం.. దైన్యం!