రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికిపైన 1,017 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా లేదని, రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.
విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల పక్షాన పోరాడి విజయం సాధించామని, భవిష్యత్‌లో ఇదే తరహాలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. విద్యార్థులు లేరనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను మూసివేయాలనే ఆలోచన చేయడం సరికాదన్నారు. 2019 నుంచి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు విడుదల చేయలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కీలకమైన విద్యాశాఖ మంత్రి నియమించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, ఉపాధ్యక్షులు కిరణ్, ప్రశాంత్, పూజ పాల్గొన్నారు.
జోగుళాంబ ఆలయంలో ఏపీ హైకోర్టు జడ్జి
అలంపూర్: పట్టణంలోని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ ఆలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి హరిహరనాథ్‌శర్మ మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అర్చకులతో కలిసి ఈఓ పురేందర్‌కుమార్ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి, అనంరతం జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.
రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం


